మహేశ్‌బాబుకు ఈడీ సమన్లు | ED summons Mahesh Babu in Saisurya Developers case | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబుకు ఈడీ సమన్లు

Apr 23 2025 3:02 AM | Updated on Apr 23 2025 9:22 AM

ED summons Mahesh Babu in Saisurya Developers case

సాయిసూర్య డెవలపర్స్‌ కేసులో నోటీసులు

28న విచారణకు రావాలని ఆదేశం 

ఈ సంస్థకు ప్రచారకర్తగా పనిచేసిన మహేశ్‌బాబు

ఆయనకు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: సాయిసూర్య డెవలపర్స్, సురా­నా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంస్థలకు ప్రచారకర్తగా పనిచేసిన ప్రముఖ సినీ నటుడు మహేశ్‌బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. సాయిసూర్య డెవలపర్స్‌ కంపెనీ నుంచి మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించా­రు. దీంతో ఈ నెల 28న బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో హాజరుకావాలని సోమవారం సమన్లు జారీచేశారు. 

సురానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్‌ ప్రాపర్టీస్‌ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లా­వా­దేవీలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్‌ చేసింది. 

మహేశ్‌బాబుకు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు ఈ సోదాల్లో ఆధారాలు లభించాయి. దీంతో ఆయనకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు వచ్చే సమయంలో పాన్‌కార్డ్, బ్యాంక్‌ అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్స్‌ను తీసుకురావాలని సూచించారు. 

ఇదీ కేసు నేపథ్యం 
సాయితులసి ఎన్‌క్లేవ్, షణ్ముఖ నివాస్‌లో ప్లాట్లు రిజి­స్ట్రేషన్‌ చేయకపోవడంతో బాధితులు నవంబర్‌లో ఈ సంస్థలపై సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 11 కేసులు నమోదు చే­శా­రు. ఈ కేసుల్లో సాయిసూర్య డెవలపర్స్‌ ప్రొప్రై­టర్‌ కె. సతీష్‌చంద్ర గుప్తా, భాగ్యనగర్‌ ప్రాపర్టీస్‌ ప్రమోటర్‌ నరేంద్ర సురానాను నవంబర్‌లోనే అరె­స్ట్‌ చేశారు. గ్రీన్‌ మెడోస్‌ ప్రాజెక్ట్‌ పేరుతో మోసాలకు పాల్పడినట్లు సతీష్‌చంద్ర గుప్తాపై సిటీ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లోనూ గతేడాది కేసు నమోదైంది. 

ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కోణంలో ఈసీఐఆర్‌ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయిసూర్య డెవలపర్స్, భాగ్య­నగర్‌ ప్రాపర్టీస్‌ సంస్థలు రంగారెడ్డి జిల్లా వట్టి­నాగు­లపల్లిలో సాయితులసి ఎన్‌క్లేవ్, షణ్ముఖ నివాస్‌ పేరుతో వెంచర్లు వేశాయి. సాయిసూర్య డెవలపర్స్‌ ఒక్కో ప్లాట్‌కు రూ.3.25 కోట్ల చొప్పున కొనుగోలు­దారులతో ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్ల చొప్పున వసూలు చేసింది. 

అయితే, ఒకరికి విక్రయించిన ప్లాట్‌ను మరికొందరి పేర్లపై రిజిస్టర్‌ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది. ఈ క్రమంలోనే నటుడు మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు సాయిసూర్య డెవలపర్స్‌ నుంచి చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఆయనకు సమన్లు జారీచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement