మన తీరం..   విదేశీ బంధం..

Dr k Pulla Rao Massive Research For Historical Traces - Sakshi

సముద్ర వాణిజ్యం జరిపిన దేశాలతో కొత్త మైత్రి

అలనాటి చారిత్రక జాడల కోసం బృహత్తర పరిశోధన 

‘ప్రాజెక్టు మౌసమ్‌’ద్వారా అన్వేషణకు శ్రీకారం 

తొలిదశ నెల్లూరులోని పురాతన పోర్టు కొత్తపట్నం నుంచి ప్రారంభం 

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ కేపీరావు ఆధ్వర్యంలో అధ్యయనం 

సాక్షి, హైదరాబాద్‌: నెల్లూరులోని కొత్తపట్నం.. ప్రస్తుతం చేపలు పట్టేవారితో కూడిన ఓ చిన్న గ్రామం. కానీ ఒకప్పుడు ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించిన నౌకాశ్రయం. ఇటీవలే పరిశోధకులు దీని గుట్టు తేల్చారు. క్రీ.పూ.3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 16వ శతాబ్దం వరకు భారీ విదేశీ నౌకల లంగరుతో ఈ పోర్టు బిజీగా ఉండేదని గుర్తించారు. ఎన్నో దేశాలతో భారతదేశానికి ఉన్న వాణిజ్యంలో ఈ నౌకాశ్రయం కీలకంగా వ్యవహరించేదని చెబుతున్నారు.

అయితే ప్రకృతి విపత్తులు, భౌగోళిక మార్పులతో ఇది నామరూపాల్లేకుండా పోయింది. ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించిన పరిశోధకుల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.పుల్లారావు ఒకరు. ఇప్పుడు ఆయన మరోసారి ఈ పోర్టుకు సంబంధించిన కీలక విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు సమాయత్తం అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంట సముద్రమార్గం ద్వారా జరిగిన విదేశీ వాణిజ్యం, ఆయా దేశాలతో సంబంధాలు, సాంస్కృతిక మైత్రీ తదితర అంశాలపై ఆయన ఆధ్వర్యంలోని బృందం విస్తృత పరిశోధనలు చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ బృహత్తర పరిశోధన శనివారం నుంచి ప్రారంభం కానుంది. 

కేంద్ర ప్రభుత్వ చొరవతో.. 
భారతదేశం తన సువిశాల సముద్ర తీరంతో అనాదిగా ప్రపంచదేశాలతో వాణిజ్యం నిర్వహిస్తోంది. వేల ఏళ్లుగా సాగిన ఈ వాణిజ్యంతో ఆర్థికపరంగానే కాకుండా, సాంస్కృతికంగా కూడా ఆయా దేశాలతో మైత్రి ఏర్పడింది. ఇక్కడి కొన్ని సాంస్కృతిక అంశాలను ఆయా దేశాలు తమలో కలుపుకోగా, విదేశీ సంప్రదాయాలు కొన్ని మనలో మమేకమయ్యాయి. క్రీస్తు పూర్వం నుంచి ఈ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. అలాంటి ప్రత్యేకతలను వెలికి తీయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ప్రాజెక్టు మౌసమ్‌’పేరుతో బృహత్తర పరిశోధన ప్రారంభించింది.

ఇది కొత్తపట్నంలో అంతరించిన పోర్టు వద్ద లభించిన 14వ శతాబ్దం నాటి చైనా మింగ్‌ వంశం చక్రవర్తి టైజాంగ్‌ జారీ చేసిన నాణెం

కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ, ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ది ఆర్ట్స్‌ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. భారత్‌తో సముద్రతీరాన్ని పంచుకుంటున్న 39 దేశాలతో తిరిగి వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంతో పాటు, ఆయా దేశాల ఆర్థిక సాంస్కృతిక వైవిధ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మైత్రీ పటిష్టం చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా తీరం వెంట ఉన్న చారిత్రక, పురావస్తు ప్రాధాన్యమున్న ప్రాంతాలు, అలనాటి నౌకాశ్రయాలున్న చోట పరిశోధనలు జరుపుతారు.

గతంలో జరిగిన పరిశోధనల్లో వెలుగు చూసిన అంశాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇతర దేశాల తీర ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వెలుగు చూసిన ఈ తరహా పరిశోధన వివరాలపై అధ్యయనం చేస్తారు. అలా మన దేశంలో తీర ప్రాంతమున్న రాష్ట్రాలకు ప్రత్యేక నిపుణులను కేటాయించారు. తమిళనాడు, కేరళ, ఒడిశా, బెంగాల్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిశోధన మొదలుకానుంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కె.పుల్లారావు ఆధ్వర్యంలో శనివారం నుంచి నెల్లూరు జిల్లా కొత్తపట్నంలో ఈ అన్వేషణ ప్రారంభం కానుంది.

70 అంశాలను పరిశీలిస్తాం  కె.పుల్లారావు 
‘క్రీస్తు పూర్వం నుంచి మనదేశం ఇతర దేశాలతో సముద్ర వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక మైత్రి నెరుపు తోంది. దాన్ని ఇప్పుడు బలోపేతం చేయాలన్నది కేంద్రం ఆలోచన. అందుకే ప్రాజెక్టు మౌసమ్‌లో మేం 70 రకాల అంశాలను పరిశీలిస్తాం. తొలి విడత పరిశోధన నెల్లూరు జిల్లా కొత్తపట్నం పురాతన పోర్టు ఉన్న ప్రాంతంలో మొదలవుతుంది. చారిత్రక, మానవ మనుగడ, ఆర్థిక పరిస్థితులే కాకుండా వృక్ష, జంతు జీవ వైవిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం’ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top