వర్షాలతో పోలీస్ శాఖ అప్రమత్తం

DGP Mahender Reddy Give Alert To Police Over Heavy Rains In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గత రెండు రోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను కలసి జిల్లాల కలెక్టర్లు సీపీలు, ఎస్పీలతో ఉమ్మడిగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు సూచనలు, సలహాలను ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ తో పాటు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top