ప్రతి ఫైలు వెనుక ఓ సామాన్యుడి ఆశ | Deputy CM Bhatti Vikramarka with Group 1 officers | Sakshi
Sakshi News home page

ప్రతి ఫైలు వెనుక ఓ సామాన్యుడి ఆశ

Apr 23 2026 3:23 AM | Updated on Apr 23 2026 3:23 AM

Deputy CM Bhatti Vikramarka with Group 1 officers

నైతిక విలువలు, మానవీయ కోణం మర్చిపోవద్దు 

గ్రూప్‌–1అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

సాక్షి, హైదరాబాద్‌: ‘మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి.. అది ఒకరి జీవితాన్ని మార్చే శక్తి అని గుర్తుంచుకోండి..’అంటూ కొత్తగా ఎంపికైన గ్రూప్‌–1 అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హితవు పలికారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 6 వారాల పాటు 214 మంది అధికారుల కు నిర్వహించిన శిక్షణా తరగతుల ముగింపు కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా సేవలో పా టించాల్సిన నైతిక విలువలు, పరిపాలనలో మానవీయ కోణాన్ని మర్చిపోవద్దని దిశానిర్దేశం చేశారు. 

‘వ్యవస్థలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి కానీ అందులో పనిచేసే వ్యక్తులు చూపే సానుభూతి మాత్రమే మార్పును తెస్తుంది. రైతు ఆశ, విద్యార్థి కల, రోగి ప్రాణం.. ఇవన్నీ మీరు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. చట్టాలకు లోబడి ఉంటూనే, మానవీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి..’అని చెప్పారు. 

ఒత్తిళ్లకు లొంగొద్దు.. :     ఫైళ్లు, సమీక్షల హడావుడిలో పడి సామాన్యుడిని విస్మరించవద్దని, రైతు సాయం, విద్యార్థి స్కాలర్‌షిప్, రోగి ఆరోగ్యం మీ కలంపైనే ఆధారపడి ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలని భట్టి అన్నారు. అధికారులు ఒత్తిళ్లకు లొంగకుండా నైతిక విలువలతో పనిచేసినప్పుడే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న సమ్మిళిత వృద్ధిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని అన్నారు. ప్రభుత్వ ప్రతిష్ట మీ నడవడిక పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ శాంతికుమారి, కోర్సు డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement