రెవెన్యూ అనకొండలు 

corruptionist in revenue field - Sakshi

శివారు భూముల వ్యవహారాల్లో దండుకుంటున్న అధికారులు

సీఎం సీరియస్‌గా ఉన్నా తీరు మారని లంచావతారాలు

సాక్షి, హైదరాబాద్ ‌: గతేడాది జూలైలో కేశంపేట తహసీల్దార్‌ లావణ్యపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో రూ.93 లక్షల నగదు దొరికితే అక్కడికి వెళ్లిన వారి కళ్లు తిరిగాయి. తాజాగా లావణ్య రికార్డును బద్దలు కొట్టేలా కీసర తహసీల్దార్‌ నాగరాజు ఏకంగా రూ.1.10 లక్షల నోట్ల కట్టలతో పట్టుబడడంతో అంతా నోరెళ్లబెట్టారు. రెవెన్యూశాఖలో వేళ్లూనుకున్న అవినీతికి ఈ రెండు ఘటనలూ నిదర్శనం. అవినీతికి చిరునామాగా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావ తారాల లీలలకు మాత్రం బ్రేకులు పడడంలేదు. భూ ముల విలువలకు రెక్కలు రావడం.. భూ వివాదాలు పెరిగిపోవడాన్ని ఆసరా చేసుకుంటున్న కొందరు అధికారులు డబ్బు మూటలకు ఆశపడుతున్నారు. దాయాదులు వివాదమైనా, సరిహద్దు తగాదైనా, న్యాయపరమైన చిక్కులైనా, సాంకేతిక సమస్యలైనా జాన్తానై అంటూ అందినకాడికి దండుకుంటున్నారు.

తాజాగా ‘షాక్‌’పేట
రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని షేక్‌పేట మండల తహసీల్దార్‌ వివాదాస్పద భూ వ్యవహారంలో తలదూర్చి ఏసీబీకి చిక్కారు. తహసీల్దార్‌ సుజాత ఇంటిపై దాడి చేసిన అధికారులు.. సుమారు రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే భూ వివాదంలో ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలిచిన ఆర్‌ఐ కూడా భారీ నగదుతో ఏసీబీకి పట్టుబట్టారు. ఆ కేసులో సుజాత భర్త ఆత్మహత్య చేసుకోవడం, ఫిర్యాదుదారుడిపై కూడా ఆరోపణలు రావడంతో ఆ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రెవెన్యూశాఖలో లంచాల ఆరోపణల నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం కూడా రెవెన్యూశాఖపై ఆరోపణలు, ఏసీబీ కేసుల విషయంలో ఎలాంటి మార్పులు రాకపోగా.. అందరూ తిరిగి పాతబాటే పట్టడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్వో నుంచి జాయింట్‌ కలెక్టర్ల వరకు అవినీతిపర్వాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

ఆ మూడు జిల్లాల్లోనే తిష్ట..
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు. అలాగే వారిని కదలించడానికి ఎవరూ సాహసించరు. దశాబ్దాల కాలంగా నయాబ్‌ తహసీల్దార్‌ నుంచి అదనపు కలెక్టర్ల వరకు అదే జిల్లాలో కొలువులు చేస్తున్నారు. రంగారెడ్డి నుంచి హైదరాబాద్, హైదరాబాద్‌ నుంచి మేడ్చల్, మేడ్చల్‌ నుంచి రంగారెడ్డి ఇలా ఈ మూడు జిల్లాల్లోనే సర్వీసు పూర్తి చేసుకుం టున్నా.. ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. విలువైన భూములను డీల్‌ చేసే క్రమం లో బడాబాబులు, ప్రజాప్రతినిధులతో ఏర్పడిన పరిచయాన్ని పలుకుబడిగా మార్చుకొని ప్రభుత్వ స్థాయిలో చక్రం తిప్పుతున్న అధికారులు తమ కుర్చీలకు ఎసరు రాకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ కాదూ కూడదని ప్రభుత్వం ఇతర జిల్లాలకు బదిలీ చేసినా.. సెలవుపై వెలుతున్నారే తప్ప బాధ్యతలు తీసుకోవడంలేదు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top