
5 నెలల్లో రూ. 96 వేల కోట్లు దాటిన రాష్ట్ర రాబడులు
రెవెన్యూ రాబడి రూ. 63 వేల కోట్లపైనే.. అప్పులు రూ. 33 వేల కోట్లు
‘కాగ్’ గణాంకాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లకు చేరవయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఐదు నెలలకుగాను రాష్ట్ర ఖజానాకు రూ. 96,654.25 కోట్లు సమకూరినట్లు కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై కాగ్ ఇచి్చన నివేదిక మేరకు రెవెన్యూ రాబడులు రూ. 63 వేల కోట్లు దాటగా అప్పులు రూ. 33 వేల కోట్ల మార్కు చేరాయి. పన్నుల ఆదాయం రూ. 60 వేల కోట్లకు చేరువ కాగా గతేడాదితో పోలిస్తే ఒక శాతం మేర పన్ను రాబడులు తగ్గాయి.
భారీగా అప్పుల పద్దు
కాగ్ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 54 వేల కోట్లకు పైగా అప్పులు సమకూర్చుకోవాలని రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపర్చగా అందులో 61.87 శాతం అంటే రూ. 33,434 కోట్లు ఈ ఐదు నెలల్లో సమకూరాయి. అయితే ఈ లెక్క ఆగస్టు వరకు మాత్రమే. గత నెలలో ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల మేర అప్పులు తీసుకుంది. ఈ అప్పులతో కలిపితే రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే అప్పులు దాదాపు 90 శాతానికి చేరనున్నాయి. గతేడాదితో పో లిస్తే అప్పులు ఈసారి కూడా ఎక్కువేనని ‘కాగ్’లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఆగస్టు 31 నాటికి ఆ ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే 59.79 శాతం అప్పులు తీసుకోగా ఈసారి అది మరో రెండు శాతం పెరిగింది.
పన్ను ఆదాయం ఇలా...
ఈ ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల రాబడులను పరిశీలిస్తే గతేడాది కంటే కొంచెం తగ్గినా అటూఇటుగానే పన్ను ఆదాయం వస్తోందని ‘కాగ్’వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి జీఎస్టీ కింద రూ. 21,144 కోట్లు, రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా రూ. 6,218 కోట్లు, అమ్మకపు పన్ను పద్దు కింద రూ. 14,079 కోట్లు, ఎక్సైజ్ రూపంలో రూ. 7,758 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 7,413 కోట్లు, ఇతర పన్నులు, డ్యూటీల ద్వారా రూ. 3,352.82 కోట్లు వచ్చాయి. వాటికి అదనంగా పన్నేతర ఆదాయం కింద రూ. 1,578 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 1,673 కోట్లు సమకూరాయి.