
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరులో భాగంగా వర్శిటీల బాటపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని వర్శిటీలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు సందర్శించి వసతి, బోధన సదుపాయాలు, అధ్యాపకుల ఖాళీలు తదితర అంశాలపై అధ్యయనం జరపనున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ సమాచారం ఆధారంగా నిరుద్యోగుల సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీభవన్‌లో సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఒక్కో వర్శిటీ బాధ్యతను ఒక్కో సీనియర్ నాయకుడికి అప్పగించనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వ్యూహం, ప్రభుత్వ భూముల అమ్మకాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు.
ఘర్ వాపసీపై దృష్టి
తెలంగాణ ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిన నేతలను తెరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఈ బాధ్యతను కూడా ఒక కీలక నేతకు అప్పగించాలని, ఆయన ఆధ్వర్యంలోనే చేరికలను ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో రెండు వారాల పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ క్రియాశీల కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి పోతురాజు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎ.మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేష్‌కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్‌లు పాల్గొన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ గైర్హాజరయ్యారు. కాగా కాంగ్రెస్‌ను వీడిన నేతల్లో చాలామంది మళ్లీ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని మధుయాష్కీగౌడ్, మహేష్‌కుమార్‌గౌడ్‌లు సమావేశానంతరం విలేకరులకు తెలిపారు.