
సాక్షి, సంగారెడ్డి: ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా జరగలేదని పటాన్‌చెరు పాశమైలారం ఫ్యాక్టరీ ప్రమాదాన్ని ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలిని పరిశీలించి.. అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం బాధాకరం. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 147 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి 57 మంది బయటపడ్డారు. అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నాం. చనిపోయినవారి కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం అందించాలని ఆదేశించాను. ఈ విషయమై ప్రభుత్వం తరఫున మంత్రులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించనున్నారు. అలాగే.. తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ.10 లక్షల సాయం అందించాలని ఆదేశించాను. గాయపడి.. కోటుకుని తిరిగి పని చేయలేని స్థితిలో ఉన్నబాధితులకు సైతం రూ.10 లక్షలు కచ్చితంగా ఇప్పిస్తాం. తక్షణ సాయం కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు రూ.లక్ష, గాయపడినవాళ్లకు రూ.50 వేలు అందిస్తాం. బాధితులను ఆదుకునేందుకు యాజమాన్యం ముందుకు రావాలి.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవత్వంతో అన్ని విధాల ఆదుకుంటుంది. మృతుల్లో తమిళనాడు, బీహార్, జార్ఖండ్ వాసులు అధికంగా ఉన్నారు. మృతదేహాల స్వస్థలాల తరలింపునకు కూడా ప్రభుత్వం సాయం అందిస్తుంది. మృతుల కుటుంబాల పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది.
..ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటిదాకా జరగలేదు. యాజమాన్యాలు ఇక నుంచి భద్రతపై ఫోకస్ చేయాలి. ప్రమాదాలను నివారించాలి. ప్రమాదాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. నిర్లక్ష్యం ఉంటే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటకే ప్రభుత్వం తరఫున అత్యున్నత దర్యాప్తు జరిపిస్తున్నాం అని సీఎం రేవంత్ అన్నారు.
