ఒప్పందాల అమల్లోవేగం పెంచండి
వాటి అమల్లో ఎదురయ్యేఅడ్డంకులను తొలగించాలి
పర్యవేక్షణకు రియల్ టైండ్యాష్ బోర్డు.. పెట్టుబడులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భూముల కేటాయింపుతోపాటు ఇతర అనుమతులు ఇచ్చిన కంపెనీలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో పాటు ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంవోయూలపై పురోగతిపై రేవంత్‌రెడ్డి.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి పనులు ప్రారంభమైన కంపెనీలు, అనుమతుల దశలో ఉన్న కంపెనీలతో పాటు సాంకేతిక, ఇతర సమస్యలతో పనులు పెండింగ్‌లో ఉన్న సంస్థల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఫ్యూచర్ సిటీతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు కేటాయించిన భూములు, స్థానిక మార్కెట్ ధరలు, ఆయా కంపెనీలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న మొత్తాన్ని అధికారులు వివరించారు.
ప్రభుత్వ విధానం ప్రకారం క్యూర్, ఫ్యూర్, రేర్ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు భూములు కేటాయించాలని రేవంత్ సూచించారు. పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు వేగంగా ఇవ్వాలని, అదే సమయంలో ఆయా కంపెనీలు పనులు త్వరగా ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా కంపెనీలకు కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
డేటా సెంటర్లపై...
డేటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగినవిధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలన్నారు. మల్టీ నేషనల్, మార్కెట్‌లో పేరు ప్రతిష్టలున్న కంపెనీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఆయా సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. వేగంగా ఎదుగుతున్న కంపెనీలు, భవిష్యత్‌లోనూ మంచి ప్రతిభ కనబర్చుతాయనుకునే సంస్థలకు తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని, మిగతా కంపెనీలను మూడో ప్రాధాన్యంగా ఎంచుకొని వాటి పెట్టుబడులు పట్టాలెక్కేలా ప్రేరణ కల్పించాలన్నారు.
ఫ్యూచర్ సిటీ కార్యాలయ పనులు
ఫ్యూచర్ సిటీలో కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంవోయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారం¿ోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీటిపై ఆయా శాఖల మంత్రులు తెలుసుకునేలా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి రియల్ టైం అప్‌డేట్ ఉండాలన్నారు. పెట్టుబడులకు సంబంధించి ఒక పూర్తిస్థాయి మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అది పని చేసేలా చూడాలన్నారు. టైర్–2, టైర్–3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో కొనసాగుతున్న కార్యకలాపాలపై సీఎం ఆరా తీశారు. ఆయా టవర్లను పూర్తి స్థాయిలో సది్వనియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, పాల్గొన్నారు.
మెట్రోపై సమీక్ష
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు సంబంధించి మిగిలిన కొంత భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిశ్రమల శాఖపై సమీక్షకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు పనులపై సీఎం సమీక్షించారు. రెండేళ్లలోనే చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. రెండో దశ మెట్రో అనుమతులు, బహదూర్‌గూడ వద్ద హైస్పీడ్ కారిడార్ వద్దకు మెట్రో విస్తరణ తదితర అంశాలపైనా చర్చించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మెట్రో సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.


