చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో భట్టి, సురేఖ, సీతక్క, పొంగులేటి, కోమటిరెడ్డి, వాకిటి, పొన్నం తదితరులు
చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి చీర అందజేస్తాం
రెండు విడతల్లో కోటి మందికి పంపిణీ
‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’పేరిట కార్యక్రమాలు
మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్ ద్వారా మార్కెటింగ్
ఇందిర విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం.. ఎస్‌హెచ్‌జీల మహిళలతో వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళలు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ‘తెలంగాణ సారె’కార్యక్రమాన్ని తలపెట్టామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వారి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోంది. అవకాశం ఉన్న చోటల్లా ప్రోత్సహిస్తోంది. ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్లు, అన్నదమ్ములు సారె, చీర పెట్టడం సంప్రదాయం. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు చీర అందిస్తోంది..’అని చెప్పారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని బుధవారం నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) ప్రతినిధులనుద్దేశించి రేవంత్ మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమానంతరం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల్లోని ఎస్ హెచ్‌జీల సభ్యులతోనూ ఆయన మాట్లాడారు
ఇందిర స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పాలన
‘ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ భారత్ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. భారత్‌కు బలమైన నాయకత్వాన్ని అందించారు. ఆమె స్పూర్తితోనే రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోంది. 2034 నాటికి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. 1,000 బస్సులకు వారిని యజమానులుగా చేశాం. సౌర విద్యుత్ ప్రాజెక్టులు పెట్టించాం. పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించాం.
వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. రాయితీపై సిలిండర్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వైఎస్సార్ హయాంలో 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తే..ప్రస్తుత ప్రజా ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల మేర ఆర్థికసాయం అందిస్తోంది. యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరింది. ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పాం. తాజాగా ‘తెలంగాణ సారె’పేరిట రెండు విడతల్లో కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నాం..’అని సీఎం చెప్పారు.
ప్రతి మహిళకు చీర అందాలి
‘తెలంగాణ సారె’కోసం ఆర్నెల్ల క్రితం చీరలు ఆర్డర్ చేస్తే.. ఇప్పటివరకు 65 లక్షల చీరలు మాత్రమే అందాయి. అందువల్ల తొలి విడత కింద డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ చీరలు పంపిణీ చేస్తాం. మిగతా 35 లక్షల చీరలు రెండో విడతలో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో పంపిణీ చేస్తాం. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో మహిళలకు ఎన్నో రకాల ఆశలు పెట్టి అడియాసలు చేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. చీరల పంపిణీ బాధ్యత మంత్రి సీతక్కకు అప్పగిస్తున్నా. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరిపి ప్రతి మహిళకు చీర అందేలా చర్యలు తీసుకోవాలి.
అంతా ఈ చీరలు ధరించాలి..
మంత్రులు, ఎమ్మెల్యేల సతీమణులకు కూడా చీరలు పంపిణీ చేయాలి. అయితే వాటికి మాత్రం బిల్లులు తీసుకోవాలి. రాష్ట్రంలోని మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణులు కూడా ఈ చీరలు ధరించాలి. బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి.. ఆ చీరలతో ఫోటోలు దిగి వాటిని అప్‌లోడ్ చేసే వీలు కల్పించాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పండుగ వాతావరణంలో నిర్వహించాలి
ఎస్‌హెచ్‌జీల సభ్యులతో మాట్లాడుతున్న సందర్భంగా..మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ రకాల వస్తువులను ఈ–కామర్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో అధికారులు సంప్రదింపులు జరపాలని రేవంత్ ఆదేశించారు. ‘చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కలెక్టర్లు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. ‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలి.
ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలి. చీర అందించే సమయంలో ఆధార్ నంబర్ తీసుకోవాలి. ముఖ గుర్తింపు చేపట్టాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళల గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే ప్రజా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతోందన్నారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేందుకు సంఘాల దగ్గరకే వస్తున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా ఐదు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లకు సీఎం చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి మాణిక్ రాజ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.
మీ పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోంది...
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఎస్‌హెచ్‌జీ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోందని నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘బాగా నడుస్తోందని, నెలకు రూ.4 లక్షల రాబడి ఉందని ఆమె తెలిపారు. ఇతర జిల్లాల నుంచి సంఘాలను అక్కడకు తీసుకెళ్లి వారి పని తీరు.. రాబడిని ప్రత్యక్షంగా చూపాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.
చీరల డిజైన్లు బాగున్నాయి
తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 9 మీటర్లు, 6 మీటర్ల చీరలు తమకు నచ్చాయని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి చీరలు ఇవ్వడంతో తమకు యూనిఫాం వచి్చందనే సంతోషం కలుగుతోందని కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు.


