సాక్షి,హైదరాబాద్: సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐబొమ్మ ఇమ్మడి రవికి నాంపల్లి హైకోర్టు ఐదురోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐ బొమ్మ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పోలీసు కస్టడీ కోరిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులో ఉన్న సాంకేతిక అంశాలు, డిజిటల్ ఆధారాలు, నెట్‌వర్క్ లింకులు తదితరాలను విశ్లేషించేందుకు రవిని ప్రత్యక్షంగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు వివరించారు. కోర్టు ఈ పిటిషన్‌ను పరిశీలించి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
ఇప్పటికే ఈ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా దృష్టి సారించింది. రవికి సంబంధించి ఫైనాన్షియల్ లింకులు, లావాదేవీలు, విదేశీ నిధుల ప్రవాహం వంటి అంశాలపై ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పైరసీ రాకెట్ వెనుక ఉన్న మిగతా వ్యక్తులు, టెక్నికల్ మద్దతుదారులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి అంశాలపై కూడా విచారణ జరగనుంది. ఈ కేసు తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేసిన నేపథ్యంలో, పరిశ్రమ వర్గాలు, నిర్మాతలు, డిజిటల్ హక్కుల పరిరక్షణ సంస్థలు ఈ విచారణను ఆసక్తిగా గమనిస్తున్నాయి.


