యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి

CM KCR inspects progress of Yadadri Lakshmi Narasimha Swamy Temple - Sakshi

సాక్షి, యాదాద్రి: ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు లేకుండా, సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. స్వామివారికి వివిధ రకాల సేవలు, పూజలు చేసే విషయంలో, భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

ఆదివారం మధ్యాహ్నం యాదాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ..శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 6 గంటలపాటు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయానికి రింగు రోడ్డు సుందరీకరణ ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లతో రింగ్ రోడ్డును  అత్యంత సుందరంగా తయారుచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అన్ని నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండిపేట చెరువును ప్రతి రెండు నెలలకు ఒకసారి కాళేశ్వరం జలాలతో నింపాలని ఆదేశాలు ఇచ్చారు. ఆలయం పరిసరాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతమైన పచ్చదనంతో నిండి ఉండాలని, ఇందుకోసం చెట్లను ఎక్కువగా పెంచాలన్నారు. స్పెషల్ ఆర్కిటెక్ట్‌లను పిలిపించి గండిపేట చెరువు ప్రాంతాన్ని అందమైన స్పాట్ గా తీర్చిదిద్దాలని సీఎం కోరారు. యాదాద్రి టెంపుల్ సిటీలో 365 క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మరో 200 ఎకరాల్లో కాటేజీల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు.

కళ్యాణ కట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రహదారుల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీకి సూచించారు. బస్టాండ్ నుంచి గుడి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ద్వారాలకు బంగారు తాపడం చేయడానికి పెంబర్తి నుండి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలని ముఖ్యమంత్రి సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఫోన్‌లో ఆదేశించారు. సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అనీ, ఒకేసారి నాలుగు వేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆలయం, టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్లను బయటకు పంపడానికి ప్రత్యేక నిర్మాణాలు చేయాలని కోరారు. 5 వేల కార్లు, 10 వేల బైకుల కోసం పార్కింగ్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

హరిత అతిథి గృహంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి, వైటీడీఏ  స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీత, ఆర్‌అండ్బీ ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, స్తపతి డాక్టర్ వేలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top