జడ్జీల కోసం రిక్రియేషన్‌ సెంటర్‌ 

CJI Justice NV Ramana Laid Foundation Stone For Recreation Center For Judges - Sakshi

దేశంలోనే తొలిసారిగా బంజారాహిల్స్‌లో నిర్మాణం 

జడ్జీల గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ  

ప్రజలు గుర్తించే రీతిలో కోర్టుల నిర్మాణం ఉండాలని వెల్లడి 

22 ఏళ్లపాటు న్యాయమూర్తిగా సేవలందించానన్న సీజేఐ

రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు: హైకోర్టు సీజే ఉజ్జల్‌ భూయాన్‌ 

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: న్యాయమూర్తుల కోసం గెస్ట్‌హౌస్‌లు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉన్నాయని.. కానీ, దేశంలోనే తొలిసారిగా హైకోర్టు జడ్జీల కోసం రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుండటం ఆనందదాయకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.7లోని వికార్‌ మంజిల్‌లో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన కల్చరల్‌ సెంటర్, గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి శుక్రవారం సాయంత్రం ఆయన భూమి పూజ చేశారు.

అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘకాలంగా న్యాయమూర్తుల గెస్ట్‌హౌస్‌ అం«శం పెండింగ్‌లో ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు పలు అవసరాల కోసం వస్తే వసతి కల్పనకు ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు.

దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే న్యాయమూర్తులకు వసతి కల్పించేందుకు ఈ గెస్ట్‌హౌస్‌ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మాత్రమే జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటివి ఉన్నాయని, ఇప్పుడు హైకోర్టుల్లో ఆ తరహా వసతుల కల్పన చేయబోయేది తెలంగాణ హైకోర్టేనని చెప్పారు. 

రాష్ట్ర సర్కార్‌ తీరు హర్షణీయం.. 
ప్రతిపాదన చేయగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై సీజేఐ హర్షం వ్యక్తం చేశారు. భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పడంపై ఆనందం వెలిబుచ్చారు. కోర్టులకు భవనాల నిర్మాణాలు ఎలా ఉండాలో నమూనాను రూపొందిస్తూ తయారు చేసిన ‘న్యాయ నిర్మాణ్‌’పుస్తకాన్ని జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ భూయాన్‌ ఆవిష్కరించారు.

జస్టిస్‌ పి.నవీన్‌రావు నేతృత్వంలోని కమిటీ న్యాయ నిర్మాణ్‌ నమూనాను రూపొందించిందని సీజేఐ తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు. కలెక్టరేట్, తహసీల్దార్, పోలీస్‌ స్టేషన్ల భవనాల మాదిరిగానే ప్రజలు గుర్తించే రీతిలో కోర్టు భవనాలు జిల్లా, తాలూకా స్థాయిల్లో కూడా ఉండాలన్నారు.

జడ్జీల పోస్టుల భర్తీతోపాటు మౌలిక వసతుల కల్పన చేస్తేనే న్యాయం అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 22 ఏళ్లుగా న్యాయమూర్తిగా సేవలు అందించానని, ఈ నెల 27న సుప్రీంకోర్టు సీజేగా పదవీ విరమణ చేయబోతున్నట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ఈ స్థాయికి రావడానికి, న్యాయమూర్తిగా సేవలు అందించడానికి ఎంతోమంది తనకు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.  

20 సూట్‌లు.. 12 డీలక్స్‌లు..
2.27 ఎకరాల్లో నిర్మించనున్న హైకోర్టు జడ్జీల గెస్ట్‌హౌస్, కల్చరల్‌ సెంటర్‌ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం పట్ల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధన్యవాదాలు తెలియజేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ఐదు వీఐపీ సూట్‌లు, మరో 20 సూట్‌లు, 12 డీలక్స్‌ గదులు, సాంస్కృతిక భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జస్టిస్‌ నవీన్‌రావు, పలువురు న్యాయమూర్తులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, ఏజీ బీఎస్‌ ప్రసాద్, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రఘునాథ్, సీపీ సీవీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top