సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాల అప్పగింత
10 నుంచి 15 శాతం కమీషన్ కోసమే ఈ దందా
దళారీగా వ్యవహరించిన వ్యక్తికి 30 శాతం
గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ కాప్స్
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాలైన సైబర్ నేరాలకు పాల్పడే సూత్రధారులకు బ్యాంకు ఖాతాలను అప్పగిస్తూ, కమీషన్లు తీసుకుంటున్న నలుగురు మనీమ్యూల్స్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు సిద్దిపేటకు చెందినవారు కాగా, ముగ్గురు సికింద్రాబాద్వాసులని డీసీపీ వి.అరవింద్‌బాబు శుక్రవారం వెల్లడించారు. సూత్రధారు లకు– మనీమ్యూల్స్‌కు మధ్య దళారిగా వ్యవహరించిన నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.
నిర్వహించినందుకు భారీ కమీషన్...
సింగపూర్‌లో ఉన్న సూత్రధారులు సిద్దిపేటకు చెందిన చొక్కాల సంపత్‌ను ట్రాప్ చేశారు. అతడు దళారిగా మారి మనీమ్యూల్స్‌ను గుర్తించి బ్యాంకు ఖాతాలు తెరిపించి నిర్వహించేవాడు. నిధుల బదిలీ సజావుగా సాగేలా చూస్తూ 30 శాతం కమీషన్ పొందేవాడు. సికింద్రాబాద్‌కు చెందిన హెచ్చు నరేష్ తన పేరిట ఖాతా తెరిచాడు. ఇతరుల పేరిట కూడా మ్యూల్ ఖాతాలను తెరిపించాడు. బ్యాంకుల నిఘా కంటికి చిక్కకుండా ఈ ఖాతాల నుంచి డబ్బును విత్‌డ్రా చేయడంలో సహాయం చేస్తూ 15 శాతం కమీషన్ తీసుకుంటున్నాడు. సికింద్రాబాద్‌కే చెందిన ఎండ్ల సురేష్, వడ్కల మహేష్ మ్యూల్ ఖాతాలు తెరిపించి వాటి నుంచి నగదు ఉపసంహరణకు సహకరిస్తూ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారు.
ఇలా వెలుగులోకి వ్యవహారం...
ఈ ఏడాది ఫిబ్రవరి 13న ‘సంగం మ్యాట్రిమోనీ’ ప్లాట్ఫామ్లో మహిళగా నటించిన సైబర్ నేరగాడితో నగరానికి చెందిన బాధితుడికి పరిచయమైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోపాటు అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఒక నకిలీ ఇన్వెస్ట్మెంట్ యాప్‌లో పెట్టుబడి పెట్టేలా చేసింది. దాని స్క్రీన్‌పై లాభాలు చూపిస్తూ, విడతల వారీగా రూ.46.65 లక్షలను పెట్టుబడి పేరిట బదిలీ చేయించుకుంది. బాధితుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా అదనపు రుసుములు చెల్లించాలని డిమాండ్ చేయడంతో మోసపోయానని గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఏసీపీ ఆర్జీ శివమారుతి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ కేఎం రాఘవేంద్ర దర్యాప్తు చేశారు.
లావాదేవీలు గుర్తించిన పోలీసులు
బాధితుడు బదిలీ చేసిన నగదు మహారాష్ట్ర, తెలంగాణలో ఉన్న బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఖాతాల ద్వారా రూ.35 లక్షల లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. మరికొన్ని ఖాతాలను గుర్తించి నరేష్, సురేష్, మహేష్‌లను పట్టుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో సంపత్‌ను అరెస్టు చేశారు. ఈ ముఠా ఇచ్చిన ఖాతాల ద్వారా రూ.1.46 కోట్ల ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ కూడా జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నగదును వీళ్లు డ్రా చేసి హవాలా నెట్వర్క్ ద్వారా సింగపూర్‌లోని సూత్రధారులకు పంపినట్లు తేలింది. వారి ఆచూకీ, వివరాలు గుర్తించడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


