
హైదరాబాద్: సిగరెట్లు అడిగితే లేవని చెప్పినందుకు ఓ యువతిపై సమీప బంధువు దాడి చేసిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రసూల్‌పురా కృష్ణానగర్ నాల్గవ బ్లాక్‌లో నివాసం ఉండే బాలిక (17) కుటుంబం స్థానికంగా దుకాణం నిర్వహిస్తుంటుంది. ఈ నెల 17న రాత్రి 8.30 గంటల సమయంలో సదరు బాలిక షాపులో ఉండగా ఆమె సమీప బంధువు అహ్మద్ సిగరెట్స్ అడిగాడు.
సిగరెట్లు లేవని చెప్పడంతో అహ్మద్ కోపంగా బాలికను బయటకు లాక్కెళ్లి కొట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత మరికొంతమంది అతని స్నేహితులు గుల్లు, ఫౌజియా, గౌసియా, నౌషీన్‌లు కూడా ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో బాలిక కంటికి గాయమైంది. తన కుమార్తెపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లి బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.