రూ.1,100 కోట్ల అంచనా వ్యయం..
11.68 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు
వెయ్యి పడకలు, 30 విభాగాల్లో కార్పొరేట్ తరహా వైద్యసేవలు
డిసెంబర్ 9న ప్రారంభానికి ఏర్పాట్లు
సనత్‌నగర్‌లో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. కార్పొరేట్ హంగులతో ప్రభుత్వ ఆసుపత్రి సిద్ధమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన ఈ ఆసుపత్రిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో 11.68 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+5 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మిస్తోంది. ఇందులో వెయ్యి పడకలు, 30 విభాగాల్లో కార్పొరేట్ తరహా వైద్యసేవలు రోగులకు అందనున్నాయి.
–సాక్షి, సిటీబ్యూరో
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే క్రిటికల్ కేసులకు రిఫరల్ ఆసుపత్రులుగా ఉన్న గాంధీ, ఉస్మానియా, నిలోపర్, ఫీవర్, ప్రసూతి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వం భావించింది. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల నుంచి అత్యవసర పరిస్థితుల్లో నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆసుపత్రులకు వెళ్లాలంటే ట్రాఫిక్ తిప్పలు తప్పడంలేదు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే ప్రత్యామ్నాయంగా నగరం నలుమూలలా పెద్ద ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్‌లో సుమారు రూ.2,500 కోట్లతో మూడు ఆసుపత్రులను ప్రతిపాదించింది. సనత్‌నగర్‌లోని ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో టిమ్స్ నిర్మాణానికి 22.6 ఎకరాలు కేటాయించింది. రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టింది. ఎల్‌బీ నగర్, అల్వాల్‌లో ఇంకా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేయాలని తొలుత ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నా వివిధ కారణాలతో పనులు పూర్తికాలేదు.
గుండె జబ్బులకు ప్రత్యేకం..
సనత్‌నగర్ టిమ్స్ (Sanathnagar TIMS) ఆసుపత్రిలో ప్రధానంగా గుండె జబ్బులకు అత్యాధునిక శస్త్రచికిత్సలు అందించనున్నారు. క్యాథ్‌ల్యాబ్‌లు, ఆధునాతన ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉంటాయి. అవయవ మార్పిడికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆపరేషన్ థియేటర్లు, నిపుణులైన వైద్యులను కేటాయించనున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఫర్ కార్డియాక్ డిసీజెస్ అండ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం అందుబాటులోకి రానుంది. సుమారు 500 పడకలను గుండె వ్యాధుల రోగులకు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని హృద్రోగ నిపుణులతో సమావేశం నిర్వహించారు. అదే సమయంలో ఇతర విభాగాలైన ప్రసూతి, పీడియాట్రిక్, న్యూరాలజీ, ఈఎన్‌టీ, పల్మనరీ, ఇతర విభాగాల్లోనూ ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఆసుపత్రి ప్రధాన భవనంలో బ్లాక్‌ల వారీగా ఇలా...
ఏ బ్లాక్: అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్స్
బీ బ్లాక్: ఓపీ నమోదు కేంద్రం, సెంట్రల్ ఫార్మసీ,
కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, క్యాథ్‌ల్యాబ్స్
సీ బ్లాక్: రేడియాలజీ డిపార్ట్‌మెంట్, పాథోలాజికల్ ల్యాబ్స్,
సాధారణ, ప్రైవేటు వార్డులు, వీఐపీ షూట్స్
డీ బ్లాక్: పరిపాలన, అకడమిక్ బ్లాక్‌లు,
200 సీట్ల సామర్థ్యం ఉన్న ఆడిటోరియం
చదవండి: జస్ట్ మిస్.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?
ఆపరేషన్ థియేటర్స్, బెడ్స్ ఇలా..
ఐసీయూలో 300, సాధారణ వార్డులో 500, ప్రైవేట్ వార్డుల్లో 200 పడకలు ఉంటాయి. మరో 30 పడకలతో డయాలసిస్ సెంటర్ ఉంటుంది. మేజర్ ఆపరేషన్ థియేటర్లు 16, మైనర్ ఆపరేషన్ థియేటర్లు 6, పాథోలజీ ల్యాబ్స్ 17, మైక్రో బయాలజీ ల్యాబ్స్ 12, బయో కెమెస్ట్రీ ల్యాబ్స్ 10, ఇతర ల్యాబ్‌లు 5, ఎక్స్‌రే యంత్రాలు 5, కాత్ ల్యాబ్‌లు 2, ఎమ్మారై, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, న్యూక్లియర్ మెడిసిన్ వార్డులు ఒక్కొక్కటి చొప్పున అందుబాటులోకి రానున్నాయి. రోగులకు సహాయంగా వచ్చే 200 మందికి ఆశ్రయం కల్పించే విధంగా ధర్మశాల, ఆసుపత్రి మొత్తానికి సరిపడా కేంద్రీకృత వంటశాల, లాండ్రీ, 30 మృతదేహాలను భద్రపరిచేవిధంగా మార్చురీ సిద్ధమవుతున్నాయి.


