‘ఎగువ భద్ర’పై పునఃసమీక్షించలేం..కర్ణాటకకు వంతపాడిన కేంద్రం! | Central Water Commission Supports Karnataka State About Telangana Letter | Sakshi
Sakshi News home page

‘ఎగువ భద్ర’పై పునఃసమీక్షించలేం..కర్ణాటకకు వంతపాడిన కేంద్రం!

Jun 4 2021 4:26 AM | Updated on Jun 4 2021 4:28 AM

Central Water Commission Supports Karnataka State About Telangana Letter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిగా నీటిని వినియోగించుకొనేలా కర్ణాటక చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి వంత పాడింది. తుంగభద్ర జలాల గరిష్ట వినియో గం లక్ష్యంగా చేపట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుతో తెలంగాణ, ఏపీ నష్టపోతాయన్న వాదనను పక్కనపెట్టి కర్ణాటక వాదనకే మొగ్గు చూపింది. మొదటి కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ జరిపిన కేటాయింపుల్లోంచే కర్ణాటక ప్రభుత్వం అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు నీటి వినియోగం చేస్తోందని, అందుకే ప్రాజెక్టుకు అడ్వయిజరీ కమిటీ ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ చేసిన ఫిర్యాదులపై స్పష్టత ఇస్తూ కేంద్ర జల సంఘం డైరెక్టర్‌ నిత్యానంద ముఖర్జీ రాష్ట్రానికి గురువారం లేఖ రాశారు. 

తొలి నుంచి వివాదమే... 
తుంగభద్ర ఎగువన 29.90 టీఎంసీల నీటిని వినియోగించేలా అప్పర్‌ భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టింది. కృష్ణా మొదటి ట్రిబ్యునల్‌ కేటాయించిన 10 టీఎంసీలు, తుంగ ఆనకట్ట ఆధునీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునీకరణ వల్ల 0.50, విజయనగర చానల్స్‌ ఆధునీకరణ వల్ల 6.25 వెరసి 13 టీఎంసీలు మిగిలాయని, వాటికి అదనంగా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాల్లో దక్కే వాటాలో 2.40 టీఎంసీలు, మిగులు జలాలు 6 టీఎంసీలు వెరసి 31.4 టీఎంసీల లభ్యత పెరిగిందని, ఇందులో ప్రవాహ నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటామని కేంద్ర జల సంఘానికి సమర్పించిన డీపీఆర్‌లో కర్ణాటక పేర్కొంది. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ తొలి నుంచీ వ్యతిరేకించింది.

రెండో కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌లో అప్పర్‌ తుంగకు 11 టీఎంసీలు, అప్పర్‌ భద్రకు 9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, అయితే ఈ ట్రిబ్యునల్‌ తీర్పు అవార్డు కానందున ఈ నీటి వినియోగానికి కర్ణాటకకు అవకాశం లేదని కేంద్రానికి తెలిపింది. అదీగాక తీర్పులో పేర్కొన్న దానికన్నా అధికంగా నీటిని వినియోగించేలా అప్పర్‌ భద్రను కర్ణాటక చేపట్టిందని వివరించింది. దీనికితోడు ఒక నదిలో నీటి వినియోగంతో దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగితే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 నిబంధనల మేరకు పరీవాహక ప్రాంతంలోని దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోవాలని, కానీ అలాంటిదేమీ లేకుండానే అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ద్వారా 29.90 టీఎంసీలను తరలించడానికి కేంద్ర జల సంఘం అనుమతించడాన్ని తప్పుబట్టింది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు పూర్తయితే తుంగభద్ర జలాశయానికి వచ్చే వరద ప్రవాహం కనిష్ట స్థాయికి తగ్గుతుందని, దీనివల్ల దిగువ రాష్ట్రాల ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని కేంద్రానికి లేఖ రాసింది.


అవి రాష్ట్రాలవారీ కేటాయింపులే.. 
తెలంగాణ ఫిర్యాదుపై కేంద్రం స్పందిస్తూ... ‘మొదటి ట్రిబ్యునల్‌ రాష్ట్రాలవారీగానే కేటాయింపులు చేసింది కానీ ప్రాజెక్టులవారీగా చేయలేదు. కర్ణాటకకు ట్రిబ్యునల్‌ 734 టీఎంసీలు కేటాయించింది. ఈ వాటాలోంచే నీటిని వినియోగించుకొనేలా కర్ణాటక అప్పర్‌ భద్ర చేపట్టింది. దీంతోపాటే వివిధ ఆధునీకరణ పనులు, మైనర్‌ ఇరిగేషన్‌ లో తమకు దక్కే వాటాల్లోంచే 29.90 టీఎంసీల నీటిని వాడుకుంటున్నామని కర్ణాటక మాస్టర్‌ ప్లాన్‌ లో పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గతేడాది డిసెంబర్‌లో జరిగిన అడ్వయిజరీ సమావేశంలో ప్రాజెక్టును ఆమోదించాం. ప్రస్తుతం ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించలేం’అని తెలంగాణకు రాసిన లేఖలో స్పష్టం చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement