సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం.. తూటా రూట్‌ మారెన్‌

Bullets Turned Into Pellets Due To Ricochet Forces Fired Into Air - Sakshi

ఆర్పీఎఫ్‌ బలగాలు కాల్పులు జరిపింది గాల్లోకే!!

వినియోగించింది ఇన్సాస్‌ రైఫిల్స్‌గా గుర్తింపు

రికోచెట్‌ కారణంగానే వేరేవైపు వెళ్లిన బుల్లెట్లు

ఇనుప స్తంభాలు, రైలింజిన్లకు తాకడంతో పిల్లెట్లుగా..

ఫలితంగానే ఒకరి మృతి, మరికొందరికి గాయాలు

సాంకేతిక దర్యాప్తులో తేల్చిన జీఆర్పీ అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం చోటు చేసుకున్న రోజు జరిగిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) బలగాల కాల్పులపై స్పష్టత వచ్చింది. ఇవి నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. సాంకేతిక అంశాలు పరిశీలించిన నేపథ్యంలో బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ రికోచెట్‌ కారణంగానే పిల్లెట్లుగా మారిన బుల్లెట్లు ఆందోళన కారులపైకి దూసుకువెళ్లినట్లు తేల్చారు. ఈ మేరకు సమగ్ర నివేదికను రూపొందించారు.

ఆందోళనకారులను చెదరగొట్టాలనే.. 
విధ్వంసానికి దిగిన ఆందోళనకారులతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు వారిని చెదరగొట్టాలని భావించారు. దీనికోసం గాల్లోకి కాల్పులు జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్‌లో ఇంజిన్లకు విద్యుత్‌ సరఫరా చేసే 220 కేవీ విద్యుత్‌ తీగలు ప్రతి ప్లాట్‌ఫాంపైనా ఉంటాయి. అలాంటప్పుడు తుపాకులు పైకెత్తి, నేరుగా గాల్లోకి కాల్పులు జరిపితే బుల్లెట్లు తగిలి విద్యుత్‌ తీగలు తెగే ప్రమాదం ఉంది. 

అదే జరిగి ఆ తీగలు కింద ఉన్న ఆందోళనకారులు, అధికారులుపై పడితే ప్రాణనష్టం భారీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్పీఎఫ్‌ బలగాలు నేరుగా పైకెత్తి కాకుండా తుపాకులను కాస్త వాలుగా ఉంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల కోసం ఆర్పీఎఫ్‌ బలగాలు వినియోగించిన తుపాకులు ఇన్సాస్‌ రైఫిళ్లు. వీటిలో 5.56 క్యాలిబర్‌ తూటాలను వాడతారు. ఇది కనిష్టంగా 400 మీటర్ల దూరం దూసుకుపోతుంది. దీన్నే ఆ తుపాకీ రేంజ్‌గా పిలుస్తారు.  

లెడ్‌తో తయారైన ఈ తూటాకు కాపర్‌ జాకెట్‌ (పై పొర) ఉంది. మ్యాగ్జైన్‌లో ఉండే తూటా తుపాకీ కాగ్‌ అయినప్పుడు ఛాంబర్‌లోకి చేరుతుంది. అక్కడ ఫైర్‌ అయ్యాక బ్యారెల్‌గా పిలిచే ముందు భాగం నుంచి అతి వేగంగా దూసుకువస్తుంది. ఈ బ్యారెల్‌ లోపలి భాగం రింగులతో కూడి ఉండటంతో బుల్లెట్‌ తన చుట్టూ తాను తిరుగుతూ.. వేగాన్ని పెంచుకుంటూ బయటకు వస్తుంది. ఇలా వచ్చిన తూటా ఎదురుగా గోడ ఉంటే తగిలి కిందపడుతుంది.  

సాంకేతిక పరిభాషలో ‘రికోచెట్‌’.. 
అదే చెక్క, ఫ్లైవుడ్‌ వంటి ఉంటే వాటిలోకి దూసుకుపోతుంది. గాజు, అద్దాలు ఉంటే వాటినీ ఛిద్రం చేస్తూ తన ‘దారి’లో ముందుకు వెళ్లిపోతుంది. గన్‌పౌడర్, బ్యారెల్‌లోని రింగుల ద్వారా వచ్చిన వేగం తగ్గే వరకు ఇలా వెళ్తూనే ఉంటుంది. రైల్వేస్టేషన్‌లో ఇనుప స్తంభాలు, ఉక్కుతో తయారైన రైలు ఇంజిన్లు, పెట్టెలు ఉంటాయి. అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వెళ్తే తూటా ఇలాంటి లోహాలతో చేసిన వస్తువులు, ప్రత్యేకంగా పటిష్టంగా నిర్మించిన గోడలకు తాకితే పరిస్థితి మారుతుంది. ఆ ధాటికి తన తన దిశను మార్చుకుంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో రికోచెట్‌ అంటారు. వేగంగా ప్రయాణిస్తున్న మార్గంలో అడ్డు తగిలిన గట్టి వస్తువు కారణంగా దాని దిశను మార్చుకుని, ఒక్కోసారి ఫైర్‌ చేసిన దిశలోకి మారి దూసుకు వచ్చేస్తుంది. 

ముక్కలై.. పిల్లెట్లుగా.. 
వాటిని తాకిన ప్రభావంతో కొన్నిసార్లు లెడ్‌ బుల్లెట్‌ ముక్కలై పిల్లెట్లుగానూ మారిపోతుంది. ఇవి దాదాపు తూటా అంత వేగంగానూ దూసుకుపోతాయి. వీటి కారణంగానే రైల్వేస్టేషన్‌లో అనేక మంది ఆందోళనకారులు గాయపడ్డారు. పరిమాణంలో పెద్దగా ఉన్న పిల్లెట్‌ దూసుకువచ్చి శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేయడంతోనే రాకేశ్‌ కన్నుమూశాడని అధికారులు తేల్చారు. గదులు వంటి క్లోజ్డ్‌ ఏరియాల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు రికోచెట్‌ నష్టం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రికోచెట్‌ అయిన తూటా ఏ దిశలో వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. 

తూటా పేలేది ఇలా...  
ఇన్సాస్‌ రైఫిల్‌ కింది భాగంలో ఉండే మ్యాగ్జైన్‌లో తూటాలు ఉంటాయి. సేఫ్టీ లివర్‌ రిలీజ్‌ కావడంతో మ్యాగ్జైన్‌లో ఉండే తూటా ఛాంబర్‌లోకి వెళిపోతుంది. ఇన్సాస్‌ మ్యాగ్జైన్‌ కెపాసిటీ 20 రౌండ్లు (తూటాలు) కాగా.. స్ప్రింగ్‌ మూమెంట్‌ కోసం 18 లేదా 19 మాత్రమే పెడుతుంటారు. చూపుడు వేలితో ట్రిగ్గర్‌ను నొక్కితే తుపాకీ వెనుక ఉండే హ్యామర్‌... ఫైరింగ్‌ పిన్‌ను ప్రేరేపిస్తుంది. దీంతో తూటా పేలి ముందు ఉండే బ్యారెల్‌ నుంచి దూసుకుపోతుంది. ఈ బుల్లెట్‌ బలమైన లోహం, వస్తువులను తాకినప్పుడు పిల్లెట్లుగా మారడం, రికోచెట్‌ కావడం జరుగుతుంది.    

(చదవండి: ‘సికింద్రాబాద్‌ విధ్వంసం’ కేసులో నిందితులకు రిమాండ్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top