Telangana: హీటెక్కిన స్టేట్‌..!

BJP MLA Raja Singh Was Arrested - Sakshi

రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. అరెస్ట్‌.. పార్టీ నుంచి సస్పెన్షన్‌

లిక్కర్‌ స్కాంలో కవితపై ఆరోపణలు

బీజేపీ నేతలపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు

ఫీనిక్స్‌ సంస్థపై ఐటీ దాడుల్లోనూ కేసీఆర్‌ కుటుంబమే లక్ష్యమంటున్న రాజకీయ వర్గాలు  

మునుగోడు పరిణామాలతో మొదలైన సెగ 

రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు 

బండి సంజయ్‌ అరెస్టుతో మరింత ముదిరిన వివాదం.. నేడు ఇంటి వద్ద దీక్ష 

రోజురోజుకూ రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయం 

టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య యుద్ధ వాతావరణం

ఆ రెండు పార్టీలవి డ్రామాలంటున్న కాంగ్రెస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా ప్రతి పరిణామమూ రాజకీయ చర్చకే దారితీస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నాటి నుంచి మొదలైన సెగ, రోజురోజుకూ రాజుకుంటోంది. ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలు, ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు, అరెస్టులు, మరోవైపు దర్యాప్తు సంస్థల దాడులతో గత వారం రోజులుగా రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి.

ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య ఓ రకంగా యుద్ధమే నడుస్తోంది. ఈనెల 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు మునుగోడు కేంద్రంగా జరిగిన రెండు పార్టీల బహిరంగ సభలు, అంతకుముందే వెలుగులోకి వచ్చిన ఢిల్లీ మద్యం స్కాం, వాసవి.. సుమధుర రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో పాటు తాజాగా ఫీనిక్స్‌ సంస్థపై ఐటీ దాడులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఓ వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  

ఐటీ దాడులతో అలజడి
రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. వాసవి, సుమధుర రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై గత వారంలో ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరుకు చెందిన ఐటీ అధికారులు హైదరాబాద్‌తో పాటు ఈ రెండు కంపెనీలకు చెందిన 20 చోట్ల ఏకకాలంలో జరిపిన దాడులు రాజకీయ రంగు పులుముకున్నాయి. సీఎం కేసీఆర్‌ కుటుంబానికి ఈ కంపెనీలతో సంబంధాలున్నాయని టీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

ఆ తర్వాత ఢిల్లీ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన మద్యం స్కాం ప్రకంపనలు రాష్ట్రంలోనూ కొనసాగుతున్నాయి. ఈ కేసు కూడా సీఎం కేసీఆర్‌ కుటుంబం వైపు మళ్లింది. సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధం ఉందని, ఆమె ద్వారానే నగదు చేతులు మారిందని బీజేపీ నేతలు ఆరోపించడం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. తాజాగా మంగళవారం ఫీనిక్స్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థపై ఐటీ అధికారులు నిర్వహించిన దాడులు కూడా చర్చనీయాంశమయ్యాయి. పన్ను ఎగవేతకు పాల్పడ్డారంటూ ఆ సంస్థపై ఐటీ దాడులు చేయగా, ఈ కంపెనీతో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయనే ఆరోపణలు మొదలయ్యాయి.  

ధర్మదీక్షకు సిద్ధమైన సంజయ్‌: ఢిల్లీ మద్యం కుంభకోణంలో హస్తం ఉందంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బీజేపీ నేతలు సోమవారం నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. కవితపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు, పలువురు మంత్రులు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారిపై పోలీసుల నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు.

దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తన పాదయాత్రలోనే ధర్మదీక్షకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్టు చేశారు. పనిలో పనిగా అసలు సంజయ్‌ పాదయాత్రకు అనుమతి లేదని, ఉద్రిక్తతలకు కారణమవుతున్నందున ఈ పాదయాత్రను నిలిపివేయాలని చెబుతూ గృహ నిర్బంధంలో ఉంచారు. పోలీసుల వైఖరికి నిరసనగా బుధవారం దీక్షలకు బీజేపీ సిద్ధమవుతోంది. తన పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తానని, ఈనెల 27న హనుమకొండలో పాదయాత్ర ముగింపు బహిరంగ సభ జరుగుతుందని బండి సంజయ్‌ ప్రకటించడంతో.. రాష్ట్రంలో పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోననే ఆందోళన నెలకొంది.  

రాజాసింగ్‌ వీడియోతో రచ్చ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌  ఓ వర్గానికి చెందిన ప్రవక్తనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్‌లో ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇలావుండగా టీఆర్‌ఎస్, బీజేపీలు రెండూ రాజకీయ డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. ఢిల్లీ మద్యం స్కాంలో కేసీఆర్‌ కుమార్తె ప్రమేయం ఉంటే ఎందుకు అరెస్టు చేయడం లేదని బీజేపీని ప్రశ్నిస్తోంది.

కేసీఆర్‌ కుటుంబానికి సంబంధాలున్న రియల్‌ సంస్థలపై కేవలం ఐటీ దాడులకే పరిమితమై మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తుతున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఆ రెండు పార్టీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని, గల్లీలో కుస్తీలు పట్టినట్టు నటిస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని విమర్శిస్తుండటం గమనార్హం.   .8 నమోదైన కేసులో భాగంగా పోలీసులు.. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఉదయం రాజాసింగ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. ఇక, హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో రాజాసింగ్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: పార్ట్‌-2 కూడా ఉంది.. చావడానికైనా రెడీ: రాజాసింగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top