హైద‌రాబాద్‌లో ఇక్కడే తరచూ ప్రమాదాలు | Big story on Hyderabad road accidents and black spots | Sakshi
Sakshi News home page

హైద‌రాబాద్‌ నగరంలో 54 బ్లాక్‌స్పాట్స్‌

Sep 4 2025 7:29 PM | Updated on Sep 4 2025 8:29 PM

Big story on Hyderabad road accidents and black spots

రెండేళ్ల గణాంకాలతో నిర్ధారణ

హైద‌రాబాద్‌ నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి పెట్టారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్టడీ ఆధారంగా 54 బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్ల గణాంకాల ఆధారంగా దీన్ని నిర్ధారించారు.  
– సాక్షి, సిటీబ్యూరో

సిటీలో బ్లాక్‌స్పాట్స్‌గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్‌ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. హైద‌రాబాద్‌ (Hyderabad) నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రమాదాల నిరోధానికి ట్రాఫిక్‌ పోలీసులు పని చేస్తారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేది మాత్రం లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులే. ఈ నేపథ్యంలోనే వారితో కలిసి ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేశారు. 2023–24లో సిటీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించారు. ఒకే ప్రాంతం లేదా స్టెచ్‌లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్‌ (Accidents) చోటు చేసుకున్న ఏరియాలను గుర్తించారు. వీటిలో యాదృచి్ఛకంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్‌ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ బ్లాక్‌స్పాట్స్‌గా నిర్ధారించారు.  

అనేకం ‘చావు’రస్తాలే..  
నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే ఉంటున్నాయి. రద్దీ వేళలు, సిగ్నల్స్‌ యాక్టివ్‌గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ 54 బ్లాక్‌స్పాట్స్‌లో దాదాపు 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆ ప్రాంతాలు సైతం హైదరాబాద్‌–సైబరాబాద్‌–రాచకొండ సరిహద్దుల్లో ఉన్నవి కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో 40 శాతం పాదచారులు, మరో 40 శాతం ద్విచక్ర వాహనచోదకులే ఉంటున్నారు.  

ఇవే ప్రధాన కారణాలు 
పరిమితికి మించిన వేగం (ప్రదానంగా ఐఆర్‌ఆర్‌లో..) 
మద్యం తాగి వాహనాలు నడపటం 
మలుపులు ఉన్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్‌ లేకపోవడం 
అత్యంత సమస్యాత్మకంగా(బ్‌లైండ్‌) ఉన్న మలుపులు 
కీలక సూచనలు చేసే సైనేజ్‌ బోర్డులు లేకపోవడం 
ఇరుకైనా రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు 
రోడ్డు ఇంజినీరింగ్‌ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం 
రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు 
క్యారేజ్‌ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు 
అవసరమైన స్థాయిలో విద్యుత్‌ దీపాలు లేకపోవడం 
వాహనచోదకులు రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ చేయడం 
నో–ఎంట్రీలోకి వాహనాలతో దూసుకుపోవడం 
రోడ్‌ మార్కింగ్‌ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటం

‘ఇన్నర్‌’లోనే అత్యధికంగా.. 
నగర ట్రాఫిక్‌ కమిషనరేట్‌ పరిధిలో 28 ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలోని కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్‌ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ ఒక ఠాణా పరిధిలో ఐదు, మరోదాని పరిధిలో నాలుగు, నాలుగు పోలీసుస్టేషన్ల పరిధిలో మూడేసి, తొమ్మిదింటిలో రెండు చొప్పున యాక్సిడెంట్స్‌ స్పాట్స్‌ ఉన్నట్లు ట్రాఫిక్‌ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు(ఐఆర్‌ఆర్‌)లో విస్తరించి ఉన్న ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధుల్లోనే బ్లాక్‌స్పాట్స్‌ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.

ఏ ఠాణా పరిధిలో ఎన్ని, ఎక్కడ? 
బోయిన్‌పల్లి: 5 (డెయిరీ ఫాం ఎక్స్‌ రోడ్, బోయిన్‌పల్లి చెక్‌పోస్టు, బోయిన్‌పల్లి ఎక్స్‌ రోడ్, సీటీఓ) 
లంగర్‌హౌస్‌: 4 (బాపూఘాట్, లక్ష్మీనగర్, మొఘల్‌ క నాలా, దర్గా) 
గాంధీనగర్‌: 3 (ట్యాంక్‌బండ్‌పైన చిల్డ్రన్‌ పార్క్, బడేమియా కబాబ్, లేపాక్షి)  
ఎస్సార్‌నగర్‌: 3 (ఈఎస్‌ఐ, ఉమేష్‌చంద్ర స్టాట్యూ, మైత్రీవనం) 
అఫ్జల్‌గంజ్‌: 3 (అఫ్జల్‌గంజ్‌ టి జంక్షన్, సీబీఎస్, చాదర్‌ఘాట్‌ చౌరస్తా) 
బేగంపేట: 3 (హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్, పీఎన్‌టీ, రసూల్‌పుర చౌరస్తా) 
చాదర్‌ఘాట్‌: 2 (నల్లగొండ చౌరస్తా, మలక్‌పేట గంజ్‌) 
మలక్‌పేట: 2 (మూసరాంబాగ్‌ చౌరస్తా, వైభవ్‌ బస్టాప్‌) 
బహదూర్‌పుర: 2 (పురానాపూల్‌ శ్మశానవాటిక, జూపార్క్‌ చౌరస్తా) 
తిరుమల గిరి: 2 (తిరుమలగిరి చౌరస్తా, లోతుకుంట) 
బంజారాహిల్స్‌: 2 (కేబీఆర్‌ పార్క్, రోడ్‌ నెం.3 జంక్షన్‌) 
చాంద్రాయణగుట్ట: 2 (బండ్లగూడ చౌరస్తా, ఒమర్‌ హోటల్‌) 
గోపాలపురం: 2  (గురుద్వార, రైల్‌ నిలయం) 
నల్లకుంట: 2 (విద్యానగర్‌ చౌరస్తా, తిలక్‌నగర్‌ చౌరస్తా) 
ఉస్మానియా యూనివర్సిటీ: 2 (హబ్సిగూడ చౌరస్తా, తార్నాక చౌరస్తా) 
జూబ్లీహిల్స్‌: 1 (జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు) 
చిక్కడపల్లి: 1 (వీఎస్‌టీ చౌరస్తా) 
గోల్కొండ: 1 (రామ్‌దేవ్‌గూడ) 
కార్ఖానా: 1 (బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డ్‌) 
లాలాగూడ: 1 (మెట్టుగూడ చౌరస్తా) 
బొల్లారం: 1 (అల్వాల్‌ రైతుబజార్‌) 
సైఫాబాద్‌: 1 (ఓల్డ్‌ సైఫాబాద్‌ ఠాణా) 
బేగంబజార్‌: 1 (ఎంజే మార్కెట్‌) 
చాంద్రాయణగుట్ట: 1 (కేశవగిరి టి జంక్షన్‌) 
హుమాయున్‌నగర్‌: 1 (రేతిబౌలి) 
కాచిగూడ: 1 (నిబోలిఅడ్డా వద్ద పాత ఠాణా) 
అంబర్‌పేట్‌: 1 (త్రిశూల్‌ బార్‌) 
మహంకాళి: 1 (ప్లాజా చౌరస్తా) 
సుల్తాన్‌బజార్‌: 1 (కోఠి ఆంధ్రాబ్యాంక్‌) 
సంతోష్‌నగర్‌: 1 (పిసల్‌బండ చౌరస్తా)  

చ‌ద‌వండి: హైద‌రాబాద్‌కు మ‌రో వందేభార‌త్‌

ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ సహకారంతో.. 
నగరంలోని బ్లాక్‌స్పాట్స్‌పై అధ్యయనానికి ట్రాఫిక్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ సెల్‌ పని చేస్తోంది. మృతులతో కూడిన ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. ప్రమాదాలకు కారణాలను గుర్తించి బల్దియా, జాతీయ రహదారుల సంస్థలకు సిఫార్సులు చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు కలెక్టర్‌ నేతృత్వంలో జరిగే రోడ్‌ సేఫ్టీ (Road Safety) మీటింగ్స్‌లో వీటిని ప్రతిపాదించడంతో పాటు పనుల పురోగతినీ సమీక్షిస్తున్నాం. 

ప్రమాదాలను నియంత్రించేందుకు షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. స్వల్ప మార్పు చేర్పులను ట్రాఫిక్‌ అధికారులే చేపడతారు. పెద్ద మొత్తంతో ముడిపడిన వాటి విషయంలో స్వచ్ఛంద సంస్థల సహాయం కోరుతున్నాం. ఇప్పటికే ఈ కోణంలో సర్వేజనా ఫౌండేషన్‌ సహాయం అందిస్తూ కొన్ని చర్యలు తీసుకుంటోంది. బ్లాక్‌స్పాట్స్‌ను నిర్మూలించడంతో పాటు నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని సూచించాల్సిందిగా ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాను కోరాం. ప్రస్తుతం వాళ్లు నగరవ్యాప్తంగా అధ్యయనం చేస్తున్నారు. నివేదిక అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటాం.  
– జోయల్‌ డెవిస్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ చీఫ్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement