బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి అనారోగ్యంతో మృతి 

Basara IIIT Student Died of illness - Sakshi

కడుపునొప్పి, వాంతులతో జూన్‌ 20న వర్సిటీ నుంచి ఇంటికి..

పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన సంజయ్‌కిరణ్‌ 

వర్సిటీలో ఫుడ్‌పాయిజన్‌ వల్లే తమ బిడ్డ మరణించాడన్న తల్లిదండ్రులు 

తోసిపుచ్చిన అధికారులు.. ఫుడ్‌పాయిజన్‌ రోజు కాలేజీలో లేడని వెల్లడి 

బాసర/సంగెం: అనారోగ్యం కారణంగా సుమారు నెల కిందట ఇంటికి వెళ్లిన బాసర ట్రిపుల్‌ ఐటీకి చెందిన ఓ విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వరంగల్‌ జిల్లాలో ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాసర ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరంగల్‌ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన శాబోతు సంజయ్‌ కిరణ్‌ (18) కొంతకాలంగా కాలేయ, జీర్ణవ్యవస్థ (ప్యాంక్రియాటైటిస్‌) సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు.

జూన్‌ 20న కడుపునొప్పి వస్తోందని.. అన్నం తింటే వాంతులు అవుతున్నాయని చెప్పి ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి అతని తల్లిదండ్రులు వరంగల్, హనుమకొండల్లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈ నెల 16న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. సంజయ్‌ వైద్యం కోసం సుమారు రూ.16 లక్షలు వెచ్చించారు.

అయినా పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంజయ్‌ మృతిచెందాడు. అయితే తమ కుమారుడి అనారోగ్యానికి బాసర ట్రిపుల్‌ ఐటీలో జరిగిన ఫుడ్‌ పాయిజనే కారణమని మృతుడి తల్లిదండ్రులు శ్రీలత, శ్రీధర్‌ ఆరోపించారు. ఈ ఆరోపణను వర్సిటీ అధికారులు ఖండించారు. ఫుడ్‌ పాయిజన్‌ జరిగిన రోజు విద్యార్థి తమ కళాశాలలోనే లేడని పేర్కొన్నారు. విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top