సాక్షి ఎఫెక్ట్‌: బాసరలో అవినీతికి పాల్పడిన అధికారులపై వేటు 

Basara Higher Officials Suspended Officers Over CorruptIon Allegations At Sakshi News

‘సాక్షి’ కథనంతో చర్యలు 

నిర్మల్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర దేవస్థానంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎట్టకేలకు వేటు పడింది. ఆలయంలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై 2017లో ‘సాక్షి’‘సరస్వతి సాక్షిగా దోపిడీ పర్వం’శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీనిపై అవినీతి నిరోధక శాఖ సుదీర్ఘంగా విచారణ జరిపి ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది. దేవస్థానంలో రూ.లక్షల్లో అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బందిపై వేటు వేసింది. గతంలో ఆలయ ఏఈఓగా చేసిన గంగా శ్రీనివాస్‌ (ప్రస్తుతం కొమురవెల్లిలో పోస్టింగ్‌), సీనియర్‌ అసిస్టెంట్‌ శైలేష్‌లను సస్పెండ్‌ చేయగా, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నూకం రజిని, ఎలక్ట్రీషియన్‌ టి.కాంతారావులను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదే కేసులో కీలకంగా ఉన్న అప్పటి ఆలయ ఈఓ ఎ.సుధాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ మమ్మాయి సాయిలు రిటైర్‌ అయ్యారు. వీరిపై ప్రభుత్వం శాఖా పరమైన చర్యలకు ఆదేశించింది. దొంగ బిల్లులు పెట్టి బినామీల సాయంతో వీరంతా లక్షల్లో డబ్బు కాజేశారు. ఇదిలా ఉంటే దోపిడీ పర్వంలో కీలక సూత్రధారులను సస్పెండ్‌ మాత్రమే చేయడంతో స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆలయ ఈఓ వినోద్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ కేసులో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


                                         ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top