ముగిసిన ‘ఎస్‌బీఐ’ వివాదం | Banking giant SBI agrees to alternative location | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘ఎస్‌బీఐ’ వివాదం

Jun 28 2026 1:14 AM | Updated on Jun 28 2026 1:14 AM

Banking giant SBI agrees to alternative location

ప్రత్యామ్నాయ స్థలానికి ఓకే చెప్పిన బ్యాంకింగ్‌ దిగ్గజం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మధ్య వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. రాయదుర్గంలో మే 28వ తేదీన సర్వేనంబర్‌ 83/1లోని 6.29 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా, అందులో ఐదు ఎకరాలు తమవంటూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా ఎస్‌బీఐ నేరుగా కోర్టు మెట్లు ఎక్కడం సంచలనం కలిగించింది. ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌బీఐతో లావాదేవీలు పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని, ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్న నిర్ణయానికి కూడా వచ్చింది. 

ఇదో పెద్ద వివాదంగా మారిన తరుణంలో రంగంలోకి దిగిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎస్‌బీఐతో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల కొనసాగింపుగా సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. వేలం ద్వారా ఎస్‌బీఐ కోల్పోయిన ఐదెకరాల స్థలానికి ప్రత్యామ్నాయంగా ఆ స్థలానికి సమీపంలోనే 2.5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం ఆఫర్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు బ్యాంక్‌ అధికారులు తాజాగా సానుకూలత వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ స్థలాలను ఎస్‌బీఐ ప్రతినిధుల బృందం ఈ నెల 23న పరిశీలించింది. దీనిపై బోర్డు ఆమోదం పొందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌బీఐ ప్రతినిధులు ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు వెల్లడించారు. 

ప్రస్తుత కోర్టు కేసుల నిబంధనలకు లోబడి తగిన చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ చర్చల అనంతరం ఇరుపక్షాలు ఒక సయోధ్య, పరస్పర అంగీకారానికి వచ్చాయి. అవసరమైన చట్టపరమైన ఫార్మాలిటీలు పూర్తి చేసి, ఈ అంశాన్ని త్వరలోనే ముగించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ సుల్తానియా, టీజీఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీ కె.శశాంక పాల్గొన్నారు. ఎస్‌బీఐ తరఫున డీబీడీ, సీడీవో జీఎస్‌.రాణా, తెలంగాణ సీజీఎం నీలేశ్‌ ద్వివేది, ఏజీఎం జి.పూవజళి హాజరయ్యారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement