కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి
సాక్షి, హైదరాబాద్: అబద్దాల పునాదులపైనే రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. మహిళలందరికీ ప్రతినెలా రూ.2500 ఇస్తానని మోసం చేశారని, తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారని, మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. కేసీఆర్ తరహాలోనే అబద్దాలు, మోసాలతోనే పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.
నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ప్రతి రాష్ట్రానికి 50 శాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెంచి దక్షిణాదికి న్యాయం చేయాలని మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడితే ఇండియా కూటమి నేతలు బిల్లును అడ్డుకున్నారన్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడంలో రేవంత్ కీలక పాత్ర పోషించారన్నారు.


