హిట్టా.. వికెట్టా? | Azharuddin MLC candidacy file pending with Governor Shiv Pratap Shukla | Sakshi
Sakshi News home page

హిట్టా.. వికెట్టా?

Apr 20 2026 4:32 AM | Updated on Apr 20 2026 4:32 AM

Azharuddin MLC candidacy file pending with Governor Shiv Pratap Shukla

గవర్నర్‌ శుక్లాకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి

గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో మంత్రి అజహరుద్దీన్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఫైలు.. పది రోజులే గడువు

ఏప్రిల్‌ 30లోపు గవర్నర్‌ ఆమోదించకపోతే అజహరుద్దీన్‌ రాజీనామా చేయాల్సిందే 

ఆమోదం కోసం గవర్నర్‌ శుక్లాను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు 

ఢిల్లీ నుంచి రాగానే లోక్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. పలు అంశాలపై గవర్నర్‌తో చర్చ 

శివప్రతాప్‌ శుక్లాతో భేటీ అయిన సీఎస్, అడ్వొకేట్‌ జనరల్‌

సాక్షి, హైదరాబాద్‌: మైనార్టీ సంక్షేమం, ప్రభుత్వరంగ సంస్థల మంత్రి మహ్మద్‌ అజహరుద్దీన్‌ భవితవ్యం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అటు అసెంబ్లీ, ఇటు మండలిలో సభ్యుడు కాని ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఈనెలాఖరుతో ఆరు నెలలు పూర్తి కానుంది. చట్టసభల నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఆయన రెండు సభల్లో ఏదో ఒక సభ సభ్యునిగా నియామకం కావాల్సి ఉంది. కానీ, ఏప్రిల్‌ 30తో ఆరు నెలల గడువు ముగుస్తున్నప్పటికీ ఆయనను ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తూ పంపిన ప్రతిపాదనకు ఇంకా గవర్నర్‌ ఆమోదం లభించలేదు. దీంతో ఈ నెలాఖరులోగా గవర్నర్‌ నిర్ణయం రాకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడనున్నాయి. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్‌ చరిత్రలో ఈ పరిణామం నిలిచిపోతుందని రాజకీయ వర్గాలంటున్నాయి.  


గవర్నర్‌పై గంపెడాశలు  
వాస్తవానికి, రాష్ట్రంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ వివాదాస్పదమైంది. గత ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కె. సత్యనారాయణ (జూలై, 2023లో)ను ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించి ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు పంపింది. కానీ, ఈ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించారు. ఈలోపు ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రొ.కోదండరాం, ఆమేర్‌ అలీఖాన్‌లను ప్రతిపాదిస్తూ మంత్రివర్గం సిఫారసు చేసింది. దీన్ని దాసోజు శ్రవణ్‌ హైకోర్టులో సవాల్‌ చేయడంతో ఈ ఇద్దరి ప్రతిపాదనలను కోర్టు కొట్టివేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు వెసులుబాటు కల్పించింది. కానీ, తుది తీర్పునకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. 

అయితే, ఈ కేసులో 2025, ఆగస్టు 13న తుది తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు కోదండరాం, ఆమేర్‌ అలీఖాన్‌ సభ్యత్వాలను రద్దు చేసింది. అనంతరం ఆగస్టు 30న మళ్లీ మంత్రివర్గం సమావేశమై కోదండరాంతోపాటు ఆమేర్‌ అలీ ఖాన్‌ స్థానంలో ప్రస్తుత మంత్రి అజహరుద్దీన్‌ పేర్లను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గత అక్టోబర్‌ 31న (జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ముందు) అజహరుద్దీన్‌ రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ, ఆయన మండలి సభ్యత్వానికి గవర్నర్‌ ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 2026 మే 1వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా నియామకం కాకుంటే మంత్రివర్గంలో స్థానాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా తీసుకునే సానుకూల నిర్ణయంపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్‌ పార్టీ గంపెడాశలు పెట్టుకున్నాయి.  

నిర్ణయం తీసుకోండి...  
ఈ అంశంలో గవర్నర్‌ నిర్ణయం తీసుకునేందుకు గత ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కానీ ఆ తర్వాత జిష్ణుదేవ్‌వర్మ బదిలీ కావడంతో మార్చిలో శివప్రతాప్‌ శుక్లా గవర్నర్‌గా వచ్చారు. ఇప్పుడు ఈ పది రోజుల్లోపు శుక్లా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదివారం అనూహ్యంగా గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ శనివారం ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉదయాన్నే లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. వీరి భేటీలో అనేక అంశాలతోపాటు అజహరుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమించే అంశం చర్చకు వచ్చినట్టు గాం«దీభవన్‌ వర్గాలంటున్నాయి. 

ప్రస్తుత పరిస్థితుల్లో వీలైనంత త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ శుక్లాను రేవంత్‌ కోరారని, క్షుణ్ణంగా పరిశీలించి వీలున్నంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌ హామీ ఇచ్చారని ఆ వర్గాలు చెబుతున్నాయి. కాగా, శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పరిపాలన, న్యాయ అంశాలపై జరిగిన చర్చలో భాగంగా అజహరుద్దీన్‌ ఫైలు గురించి కూడా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. 

వెంటనే సీఎం రేవంత్‌ కూడా గవర్నర్‌ను కలిసి కోరడంతో అజహరుద్దీన్‌ విషయంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గవర్నర్‌ సానుకూల నిర్ణయం తీసుకుంటే అజహరుద్దీన్‌ యథాతథంగా మంత్రిగా కొనసాగనుండగా, ఏ నిర్ణయం తీసుకోకపోయినా, ప్రతికూల నిర్ణయం తీసుకున్నా ఆయన మంత్రి పదవిని కోల్పోనున్నారు. ఒకవేళ అదే జరిగితే మంత్రిగా అజహరుద్దీన్‌ మరోమారు ప్రమాణం చేయాల్సి ఉంటుందని, మళ్లీ ఆయన పేరును మంత్రివర్గం సిఫారసు చేయాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలంటున్నాయి. మరి ఏం జరుగుతుందో... అజహరుద్దీన్‌ భవితవ్యం ఏమవుతుందో వేచి చూడాల్సిందే!    

Advertisement
 
Advertisement
Advertisement