వేగంగా కసరత్తు పూర్తి చేసేందుకు అనుసరణీయం
ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వ కేడర్‌లోకి ఆర్టీసీ ఉద్యోగులు
తత్సమాన స్థాయి పోస్టుల్లో ఫిక్సేషన్
డిపో మేనేజర్ స్థాయి నుంచి జీతాల పెరుగుదల
జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లోకి కండక్టర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల వారి జీతాల్లో పెరుగుదల నమోదు కానుంది. అయితే, ఈ మార్పు డిపో మేనేజర్ స్థాయి నుంచే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనంతరం అక్కడ చోటుచేసుకున్న మార్పులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా క్లిష్టమైనది. దీనికి సంబంధించిన కసరత్తుకు భారీగా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, ఏపీలో విలీన ప్రక్రియ జరిగినందున, అక్కడి ప్రక్రియనే అనుసరిస్తే జాప్యం జరగదు. గతంలో ఉమ్మడి ఆర్టీసీలో భాగమైనందున, రెండు ఆర్టీసీల్లో పెద్ద తేడా లేదు. దీంతో ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం ఏపీ మోడల్‌నే అనుసరించే అవకాశం ఉంది. ప్రభుత్వంలో విలీనం జరిగినప్పుడు ఆర్టీ సీలోని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల కేడర్‌లో ఫిక్స్ చేస్తారు.
ఆర్టీసీ పోస్టుకు సరిసమానమైన ప్రభుత్వ పోస్టుల్లో కలిపేస్తారు. సరిసమాన పోస్టు లేనప్పుడు కాస్త అటూ ఇటూగా ఉన్న కేడర్‌తో అనుసంధానిస్తారు. ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత, పెద్ద పోస్టు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)దే. ఈ పోస్టును అదనపు కమిషనర్ కేడర్‌గా మార్చారు. రీజినల్ మేనేజర్ పోస్టును జాయింట్ కమిషనర్ స్థాయిగా, డివిజినల్ మేనేజర్ (డిప్యూటీ మేనేజర్) పోస్టును డిప్యూటీ కమిషనర్ స్థాయిగా, డిపో మేనేజర్ పోస్టును అసిస్టెంట్ కమిషనర్ స్థాయిగా ఖరారు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ స్థాయి నుంచి ఆ పైస్థాయి పోస్టులకు గెజిటెడ్ హోదా కల్పించారు. ప్రభుత్వంలో డ్రైవర్ పోస్టు ఉన్నందున ఆర్టీసీ డ్రైవర్‌ను డ్రైవర్ స్థాయిగానే పరిగణిస్తున్నారు. కానీ, ప్రభుత్వంలో కండక్టర్ పోస్టు లేనందున, కండక్టర్ పోస్టును జూనియర్ అసిస్టెంట్ స్థాయిగా గుర్తించారు.
పెద్ద అధికారుల జీతాల్లో తగ్గుదల... కానీ..
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ఫిక్స్ చేసిన తర్వాత ఆ స్థాయి స్కేల్ వర్తింపజేస్తారు. దీంతో ప్రభుత్వ స్కేల్‌కు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. కానీ, ఆర్టీసీలోని ఈడీ, ఆర్‌ఎం, డీవీఎం, చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (సీఎంఈ), చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం), చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (సీటీఎం), విజిలెన్స్ డైరెక్టర్, డిప్యూటీ మెకానికల్ ఇంజినీర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్, విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి వరకు జీతాలు ప్రస్తుతం ప్రభుత్వంలోని సమానమైన స్థాయి పోస్టుల కంటే ఎక్కువ ఉన్నాయి. దీంతో ఈ పోస్టుల జీతాల పెరుగుదల ఉండదు. ఆ తర్వాత ఉన్న డిపో మేనేజర్ పోస్టు నుంచి జీతాల పెరుగుదల నమోదవుతుంది. తక్కువ స్కేల్‌తో ఉన్న ఆర్టీసీ పోస్టుల జీతాలను ప్రభుత్వ స్కేల్‌కు సమానంగా పెంచుతున్నప్పుడు, ఎక్కువ జీతాలున్న పోస్టులను ప్రభుత్వ స్కేల్‌కు సమానం చేయాలంటే తగ్గించాల్సి ఉంటుంది. కానీ, ఏపీలో అలా తగ్గించకుండా ఉన్నది ఉన్నట్టుగా స్థిరీకరించారు. తదుపరి పీఆర్‌సీలతో ప్రభుత్వ కేడర్ స్కేల్ పెరిగి ఆర్టీసీ అధికారుల జీతాల కంటే ఎక్కువైనప్పుడే పెంచుతారు. అప్పటి వరకు కేవలం ఇంక్రిమెంట్లను మాత్రమే జత చేస్తారు.
పే స్కేల్ ఇలా...
⇒ ఏపీఎస్‌ఆర్టీసీ విలీన సమయంలో డిపో మేనేజర్ వేతనం రూ.57,000–రూ.1,42,500గా ఉంది. దాన్ని రూ.57,100–రూ.1,47,760గా మార్చారు.
⇒ గ్రేడ్–1 డ్రైవర్ ప్రారంభ జీతం రూ.25,480 నుంచి రూ.29,980కు, గ్రేడ్–2 డ్రైవర్ ప్రారంభ జీతం రూ.21,390 నుంచి రూ.27,500కు, గ్రేడ్–1 కండక్టర్ ప్రారంభ జీతం రూ.21,670 నుంచి రూ.28,280కు, గ్రేడ్2 కండక్టర్ ప్రారంభ జీతం రూ.19,580 నుంచి రూ. 25,220కి పెరిగింది. గ్రేడ్2 మెకానిక్ ప్రారంభ జీతం రూ.20,300 నుంచి రూ.25,220కి పెరిగింది.
⇒ ప్రభుత్వ అధికారులతో పోలిస్తే ఆర్టీసీ ఉన్నతాధికారుల గ్రాట్యుటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ అధికారుల గ్రాట్యుటీపై సీలింగ్ ఉంది. ఉన్నతాధికారుల గ్రాట్యుటీ దాదాపు రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువగానే తగ్గుదల నమోదు కావాల్సి ఉంటుంది. దీంతో దాన్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రతిపాదించనున్నారు.
⇒ ప్రస్తుతం ఆర్టీసీలో గ్రేడ్ పే విధానం ఉంది. జీతానికి అదనంగా వారి పోస్టు స్థాయిని బట్టి ఈ మొత్తం జోడిస్తున్నారు. ఇది అసిస్టెంట్ డిపో మేనేజర్ స్థాయి నుంచి మొదలవుతుంది. ప్రభుత్వంలో గ్రేడ్ పే విధానం లేనందున దీన్ని తొలగిస్తారు.


