న్యాయం కావాలని అడిగితే చంపేస్తారా: ఆందోళనకారులు

Agnipath Scheme Protest: Secunderabad Railway Station Protesters Voice - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తమపై కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్‌ ఇచ్చారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తాము ఏమైనా ఉగ్రవాదులమా.. కాల్పులు జరపడానికి అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా అని మండిపడ్డారు. తమ నిరసనల్లో ఎలాంటి రాజకీయాలు లేవని, తమ న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.

‘నాలుగు సంవత్సరాలుగా దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఆందోళనల్లో రెండు బోగీలు తగలబడ్డాయంటున్నారు.. మూడు ఏళ్లుగా మా జీవితాలు నాశనం అవుతున్నాయి. అవి ఎవరూ పట్టించుకోవడం లేదు. కేవలం నాలుగేళ్ల కోసం సర్వీస్‌లో చేరలేం. అందరికీ పరీక్షను నిర్వహిస్తామని తెలిపే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. వయోపరిమితిని కూడా పెంచాలి. దాదాపు 2 వేల మందికి పైగా వచ్చాం. 8.30 గంటలకు వచ్చాం. మేం ఫిజికల్‌, మెడికల్‌పాస్‌ అయినం. పెండింగ్‌లో ఉన్న కామన్‌ ఎగ్జామ్‌ను నిర్వహించాలి. ’ అంటూ ఆర్మీ అభ్యర్థులు పేర్కొన్నారు.
చదవండి: Secunderabad Railway Station: రైల్వేస్టేషన్‌ వదిలి వెళ్లిపోండి.. లేదంటే మరోసారి కాల్పులు

మరోవైపు బీహార్, యూపీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అగ్నిపథ్ ఆర్మీ ఎంపిక పథకానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గత నాలుగు గంటలుగా పోలీసులు కాల్పులు జరిపినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రైల్వేట్రాక్‌పైనే వేలాదిమంది నిరసనకారులు బైఠాయించారు. రైల్వే పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు.

రైల్వే స్టేషన్‌ వదిలి వెళ్లిపోవాలని, ఆందోళనలు విరమించకపోతే మళ్లీ కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరించారు.సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. అలాగే రైల్వేస్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.
చదవండి: అగ్నిపథ్‌ ఆందోళన ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ మెట్రో రైళ్లు రద్దు

అసలేంటి అగ్నిపథ్‌?
కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో చేరాలనుకునే వారికోసం కొత్తగా స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకం ‘అగ్నిపథ్’ను తీసుకొచ్చింది.. ఇందులో భాగంగా మూడు నెలల్లోనే 45 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపికయ్యే వారిని అగ్నివీరులుగా పిలుస్తామని తెలిపింది. అంతవరకూ బాగానే ఉన్నా ఈ పథకం కింద అగ్నివీరులకు లభించే ప్రయోజనాల విషయంలోనే అసంతృప్తి మొదలైంది. ప్రధానంగా అగ్నిపథ్ పథకంలో భాగంగా ఎంపికైన జవాన్లలో 75 శాతం మందిని నాలుగేళ్లకే ఇంటికి పంపేయాలని నిర్ణయించడం చిచ్చు రేపుతోంది. 

వలం 25 శాతం మందిని మాత్రమే నాలుగేళ్ల తర్వాత 15 ఏళ్ల వరకూ కొనసాగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ యువతలో ఆందోళన రేపుతోంది. అంతే కాదు అగ్నిపథ్ పథకం ద్వారా ఎంపికైన జవాన్లకు పెన్షన్ ఉండదు. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలూ దక్కవు. ప్రస్తుతం ఆర్మీకి ఇస్తున్న ఎలాంటి ప్రయోజనాలు వారికి దక్కవు. వీరి పదవీకాలం పూర్తి కాగానే సెటిల్ మెంట్ మొత్తం ఇచ్చి పంపేస్తారు. దీంతో ఈ పథకం ప్రకటించి 24 గంటలు తిరగకుండానే దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top