నీట మునిగి 8 మంది మృతి | 8 people drowned in different locations | Sakshi
Sakshi News home page

నీట మునిగి 8 మంది మృతి

Mar 30 2026 3:18 AM | Updated on Mar 30 2026 3:18 AM

8 people drowned in different locations

ఈతకెళ్లి ఆరుగురు, చెరువులో మునిగి ఇద్దరు

వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు

కొండపాక (గజ్వేల్‌): రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో నీట మునిగి 8 మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు ఈతకు వెళ్లి మరణించగా, మరో ఇద్దరు చెరువులో మునిగి చనిపోయారు. గజ్వేల్‌ మండలంలోని కొడకండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు (వరుసకు అక్కా తమ్ముడు) రిషిక (13), కుక్కల మనీష్‌ అలియాస్‌ లక్కీ (11) మామ వరుసైన గణేశ్‌తో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. గణేశ్‌ పశువులను మేతకు తీసుకెళ్లగా మల్లన్న సాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లే కాలువలో మనీష్‌ ఈత కోసం దిగాడు. 

ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండగా రిషిక కాపాడేందుకు కాలువలోకి దిగగా ఇద్దరూ మృతి చెందారు. రుషిక కొడకండ్ల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండగా, మనీష్‌ 7వ తరగతి చదువుతున్నాడు. కుటుంబీకులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎస్‌హెచ్‌ఓ, ట్రైనీ ఐపీఎస్‌ అయేషా ఫాతిమా ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. 

ఇదిలాఉండగా హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి బాలాజినగర్‌కు చెందిన రాములు కుకునూరుపల్లి మండలంలోని ముద్దాపూర్, రాంచంద్రాపూర్‌ శివారులో కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీంతో రాములు కొడుకు రాజుతోపాటు 8 మంది స్నేహితులతో కలిసి సరదా కోసం వ్యవసాయ బావి వద్దకు వచ్చారు. విజయ్‌కుమార్‌తోపాటు మరో నలుగురు మల్లన్న సాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లే కాలువలో ఈత కోసం దిగారు. 

నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతోపాటు ఈత రాకపోవడంతో విజయ్‌కుమార్‌ నీటిలో మునిగిపోతుండగా స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు.. అయినా ఫలించలేదు. దీంతో విజయ్‌కుమార్‌ మృతి చెందాడు. విజయ్‌ కుమార్‌ ఆర్మీ క్యాంటీన్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నాడన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబీకుల మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఖమ్మం జిల్లాలో విషాదం
సత్తుపల్లి టౌన్‌: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్‌ నగర్‌లో నివాసం ఉంటున్న వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన ఒంగూరి జానకి, వెంకటేశ్వరరావు కుమారుడు నాగబాబు (12) రేజర్ల సమీపాన మామిడి తోటలో గేదెలు మేపేందుకు వెళ్లాడు. నాగబాబుతోపాటు అదే కాలనీకి చెందిన వంటిపులి దేవ (11), షేక్‌ సైదులు కూడా వెళ్లారు.

 

ఈ క్రమంలో పక్కనే నీళ్లు ఉన్న మట్టి క్వారీ గుంత వద్దకు వెళ్లి ఈత కొట్టేందుకు దూకారు. అయితే క్వారీ గుంతలో నీళ్ల లోతును అంచనా వేయలేక మునిగిపోతూ కేకలు వేశారు. సమీపంలో గేదెలు మేపుతున్న దేశినేని సుధారాణి తన చున్నీ విసిరి భుజాల వరకు నీట మునిగిన షేక్‌ సైదులును కాపాడింది. మిగతా ఇద్దరు నీళ్లల్లో పూర్తిగా మునిగిపోవడంతో మరణించారు. 

చెరువులో మునిగి ఇద్దరు మృతి
కోనరావుపేట (వేములవాడ): చెరువులో మునిగి ఇద్దరు చనిపోయిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో విషాదం నింపింది. ధర్మారం గ్రామానికి చెందిన ముడికె లక్ష్మీరాజం (65), కుమ్మం మొండయ్య (55) అనే గొర్రె కాపరులు తమ జీవాలను తీసుకుని గ్రామ శివారులోని పెద్దచెరువు వైపు వెళ్లారు. 

గొర్లను చెరువులోకి తీసుకెళ్లి స్నానం చేయించేందుకు దిగగా లక్ష్మీరాజం ప్రమాదవశాత్తు చెరువులో జారిపడ్డాడు. గమనించిన మొండయ్య అతడిని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. ఈక్రమంలో లక్ష్మీరాజం.. మొండయ్య మెడను గట్టిగా పట్టుకోవడంతో ఈత వచ్చినా కూడా ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుంటలో మునిగి...
అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం కోహెడలో నివసిస్తున్న నాగనా థ్‌ పంచాల్‌ కుమారుడు నరేష్‌ నాగనాథ్‌ (14) కోహెడ జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన నరేష్‌ ఈత కొట్టేందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేక పోయింది. 

ఆదివారం ఉదయం సంఘీనగర్‌ నుంచి గండిచెరువుకు వెళ్లే దారిలో ఉన్న సమల గడ్డ కుంట వద్ద నరేష్‌ దుస్తులు, చెప్పులు కనిపించడంతో కుంటలో పరిశీలించగా మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement