తాజాగా కేటాయించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్
1,547కు పెరగనున్న ప్రభుత్వ పీజీ వైద్య సీట్ల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 75 పీజీ సీట్లను కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా వైద్య కళాశాలతోపాటు మరో ఆరు ప్రభుత్వ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో కొత్త సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా కాలేజీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 4 సీట్లు మంజూరు చేసిన ఎన్‌ఎంసీ.. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 8 సీట్లు, మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నాలుగు పీజీ సీట్లను మంజూరు చేసింది.
కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, రామగుండం వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున పీజీ సీట్లు కేటాయించడం విశేషం. పెరిగిన సీట్లకు ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు జరగనున్నాయి. 75 సీట్లు పెరగడంతో రాష్ట్రంలో స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య పెరిగి మరింత నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,983 పీజీ వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,472 పీజీ సీట్లు ఉండగా వాటికి 75 సీట్లు అదనంగా కలవనున్నాయి. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య 1,547కు పెరగనుంది. వాటిలో 50 శాతం అఖిల భారత కోటా కింద పోగా మిగతా 50 శాతం అంటే 773 సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకే లభించనున్నాయి.


