
తీవ్ర దారిద్య్రంలో 37.6 కోట్ల మహిళలు
89.6 కోట్ల మందికి స్వచ్ఛ ఇంధనం లేదు
ఇంటర్నెట్ వినియోగిస్తున్నది 65 శాతమే
స్త్రీల దుస్థితిని కళ్లకు కట్టిన ఐరాస నివేదిక
ప్రపంచవ్యాప్తంగా 37.6 కోట్లకుపైగా మహిళలు తీవ్ర దారిద్య్రంలో మగ్గుతున్నారని, ఇది పురుషుల సంఖ్య కంటే ఎక్కువని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలులో పురోగతిపై విడుదల చేసిన ‘ద జెండర్ స్నాప్‌షాట్ 2025’లో వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ తమ జీవితకాలంలో శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారు. జెనరేటివ్ ఏఐ వల్ల పురుషులతో పోలిస్తే మహిళల ఉద్యోగ, ఉపాధి అవకాశాలే ఎక్కువగా దెబ్బతింటాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న పురుషులు 70 శాతం కాగా, మహిళల్లో ఇది 65 శాతమే. ఈ నివేదిక ఇంకా ఏమేం చెప్పిందంటే..
ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ‘ద జెండర్ స్నాప్‌షాట్ 2025’.. ప్రపంచవ్యాప్తంగా మహిళల స్థితిగతులపై కీలక అంశాలను వెల్లడించింది. మహిళల్లో పేదరికం అనారోగ్యం, వారిపై వివక్ష ఇవన్నీ తగ్గాలంటే.. ప్రభుత్వాలు విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచాలని, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలని ఈ నివేదిక పేర్కొంది. ఇలా పెట్టే పెట్టుబడులు వృథా కావని, వీటివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడతాయని తెలిపింది.
పేదరికం
మహిళా పేదరికం 2020 నుంచి భారీగా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2030 నాటికి 35 కోట్లకుపైగా బాలికలు, స్త్రీలు పేదరికంలో మగ్గుతూనే ఉంటారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీలు) అమలును ఇప్పటినుంచి వేగవంతం చేస్తే 2025లో 9.2 శాతంగా ఉన్న ఈ పేదరికాన్ని 2050 నాటికి 2.7 శాతానికి పరిమితం చేయొచ్చు.
లింగ సమానత్వం
గత 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా.. మహిళల పట్ల వివక్ష చూపే అనేక చట్టాలను తొలగించారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చట్టాలు వచ్చాయి. మానభంగానికి (రేప్) సంబంధించి 63 దేశాలు చట్టాలు చేశాయి. కానీ ఇప్పటికీ కేవలం 38 దేశాల్లోనే అమ్మాయిలకు వివాహానికి కనీస వయసు 18 ఏళ్లుగా ఉంది.
⇒ 15–49 ఏళ్ల మహిళల్లో.. గత ఏడాది కాలంలో.. ప్రతి 8 మందిలో ఒకరు (12.5 శాతం) తమ ప్రస్తుత లేదా మాజీ భాగస్వామి వల్ల శారీరక లేదా లైంగిక హింసకు గురయ్యారు.
⇒ 2025 జనవరి 1 నాటికి జాతీయ పార్లమెంటుల్లో మహిళా సభ్యుల శాతం 27.2 శాతం. 102 దేశాల్లో దేశాధిపతి లేదా ప్రభుత్వాధిపతిగా ఇప్పటివరకూ మహిళలు ఎంపిక/ఎన్నిక కాలేదు.
⇒ 2025 ఆగస్టు 1 నాటికి కేవలం 29 దేశాల్లోనే.. దేశాధిపతి లేదా ప్రభుత్వాధిపతిగా మహిళ ఉన్నారు. 5 ఏళ్ల కిందట ఇలాంటి దేశాల సంఖ్య 22.
⇒ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మేనేజర్ స్థాయిలో మహిళలు 30 శాతం ఉన్నారు.
ఆరోగ్య భద్రత
పురుషులతో పోలిస్తే దాదాపు 6.4 కోట్ల మంది మహిళలకు ఆరోగ్య భద్రత లేదు. పోషకాహార లోపాల వల్ల బాలికలు, స్త్రీల ఆరోగ్యం దారుణంగా తయారవుతోంది. 15–49 ఏళ్ల మధ్య ఉండే యువతులూ, స్త్రీలలో రక్తహీనత 2025లో 31.1 శాతంగా ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 33 శాతానికి పెరుగుతుంది
2000–2023 మధ్య మహిళల ప్రసూతి మరణాల రేటు 39.3 శాతం తగ్గింది. మగవాళ్లు తమ జీవితంలో అనేక రకాల తీవ్రమైన వ్యాధులూ, అనారోగ్య పరిస్థితులతో గడిపే మొత్తం సమయం.. 2021లో 8 ఏళ్లు కాగా, మహిళల్లో ఇది 10.9 సంవత్సరాలు.
విద్య
పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో చేరికలు, చదువు పూర్తి విషయంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ముందున్నారు. కానీ, సబ్‌సహారన్ ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియాల్లో మాత్రం సెకండరీ విద్య పూర్తి చేయడంలో మాత్రం వెనకబడ్డారు.
స్వచ్ఛ ఇంధనం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 89.6 కోట్ల మంది మహిళలకు స్వచ్ఛ ఇంధనం లేదా ఆ సాంకేతికత అందుబాటులో లేదు. 2030 నాటికి ఇది సాధించాలంటే ఇప్పటి నుంచి ఏటా 8 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలి. ఈ పెట్టుబడికి 24 రెట్ల ఆదాయం తిరిగి వస్తుంది.
ఏఐ
జెనరేటివ్ ఏఐ మహిళల ఉద్యోగ, ఉపాధి అవకాశాలనూ దెబ్బతీయనుంది. 21.1 శాతం పురుష ఉద్యోగాలపై ఈ ప్రభావం ఉంటే.. మహిళలపై ఇది 27,6 శాతం.
ఇంటర్‌నెట్
2024లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న పురుషులు 70 శాతం కాగా, మహిళల్లో ఇది 65 శాతమే. అధిక ఆదాయ దేశాల్లో 93 శాతం మహిళలు, 94 శాతం పురుషులు ‘ఆన్‌లైన్’లో ఉంటున్నారు.
దివ్యాంగులు
మామూలు మహిళలతో పోలిస్తే దివ్యాంగులు చాలాచోట్ల వివక్షను ఎదుర్కొంటున్నారు. మామూలు మహిళల్లో 65 శాతం ఇంటర్నెట్ వాడుతుంటే దివ్యాంగుల్లో 26 శాతమే వినియోగిస్తున్నారు.
శాంతి
2024లో తీవ్రమైన అశాంతి, ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న బాలికలు, స్త్రీలు 67.6 కోట్లు. 1990ల తరువాత ఇదే అత్యధిక . అశాంతి, ఘర్షణలు, యుద్ధవాతావరణం ఉన్న దేశాల్లోని పార్లమెంటుల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 20 శాతమే.