మనదేశంలో కొన్ని రంగాల్లో పురుషులు, మహిళలకు దాదాపు ఒకే వేతనం
మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో జెండర్ పే గ్యాప్ తగ్గుదల
అమెరికా, ఫ్రాన్స్, కెనడాలలో ఈ అంతరం అత్యధికం
గ్లోబల్ హెచ్‌ఆర్ పేరోల్ కంపెనీ డీల్ సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో కొన్ని రంగాల్లో పురుషులు– మహిళల మధ్య వేతన అంతరం క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో జెండర్ పే గ్యాప్ తగ్గుదల నమోదైనట్టు సర్వేల్లో తేలింది. ఆయా రంగాల్లో అమెరికా, ఫ్రాన్స్, కెనడాలలో ఈ అంతరం అత్యధికంగా ఉండగా, మనదేశంలో మాత్రం ప్రపంచంలోనే అతి తక్కువగా లింగ వేతన అంతరాలు ఉన్నట్టు ‘డీల్’సంస్థ ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ కంపెన్సేషన్ రిపోర్ట్–2025’లో తెలిపింది.
భారత్‌లో పురుషులు, మహిళల సగటు జీతాలు ప్రస్తుతం దాదాపు ఒకేలా ఉన్నాయని, ఏడాదికి 13– 23 వేల అమెరికన్ డాలర్ల మధ్య ఉన్నట్టుగా వెల్లడించింది. ఇది పెరుగుతున్న వేతన సమానత్వం, డేటా ఆధారిత పరిహార నమూనాల వినియోగానికి సంకేతమని పేర్కొంది. అయితే, టెక్, ప్రొడక్ట్ ఇతర రంగాల్లో మాత్రం వేతన అంతరం ఇంకా ఎక్కువగానే ఉందని తెలిపింది.
సర్వేలోని కీలక అంశాలు..
⇒ ఈ అధ్యయనంలో 150 దేశాలలో పది లక్షలకు పైగా కాంట్రాక్టు కార్మీకులు, 35 వేల కంటే ఎక్కువ మంది కస్టమర్లు పాల్గొన్నారు.
⇒ భారత్‌లో ఇంజనీరింగ్, డేటా నిపుణుల సగటు వేతనం ఏడాదికి 40 శాతం తగ్గిందని, 2024లో 36 వేల అమెరికన్ డాలర్ల నుంచి 2025లో 22 వేల అమెరికన్ డాలర్లకు తగ్గిందని కూడా నివేదికలో తెలిపారు.
⇒ ఇండియాలో 60 నుంచి 70 శాతం పూర్తికాల ఉద్యోగులు, 30 నుంచి 40 శాతం కాంట్రాక్ట్ కార్మీకులతో హైబ్రిడ్ వర్క్‌ఫోర్స్ నిర్మాణంపై ఎక్కువగా ఆధారపడటం కొనసాగుతోందని పేర్కొంది.
⇒ టెక్నాలజీ, స్పెషలిస్ట్ సేవలకు అత్యధిక సగటు పరిహారాన్ని యూఎస్, యూకే, కెనడా అందిస్తున్నాయని నివేదిక తెలిపింది. నైపుణ్యాల కొరత, పరిమిత బెంచ్‌మార్క్ డేటా కారణంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ కమాండ్ ఉద్యోగాలు 20 నుంచి 25 శాతం వరకు ప్రీమియంలను చెల్లిస్తున్నట్టు తేల్చింది.
⇒ 2021 నుంచి భారత్, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో టెక్నాలజీ నిపుణులకు మధ్యస్థ ఈక్విటీ గ్రాంట్లు కూడా క్రమంగా పెరిగినట్టు తెలిపింది. ఈక్విటీ ప్యాకేజీ పరిమాణంలో యూఎస్ ముందంజలో ఉండగా.. కెనడా, ఫ్రాన్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత, ఉత్పత్తి రంగాల్లో లింగ వేతన అసమానతలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది.
⇒ ‘లింగ వేతన అంతరం గణనీయంగా తగ్గిన కొన్ని దేశాలలో భారత్ ఒకటిగా ఉండటం ప్రోత్సాహకరంగా ఉంది. ఈ పురోగతి పక్షపాతం కంటే యోగ్యతకు ప్రతిఫలమిచ్చే న్యాయబద్ధత, పారదర్శకత, డేటా ఆధారిత పరిహార నమూనాల వైపు విస్తృత మార్పును ప్రతిబింబిస్తుంది’అని డీల్ ఏపీఏసీ జనరల్ మేనేజర్ మార్క్ సామ్లాల్ పేర్కొన్నారు.


