పదోన్నతుల్లో న్యాయం చేయండి   

2009 Batch SIs Requested Minister KTR Over Promotions - Sakshi

మంత్రి కేటీఆర్‌కు 2009 బ్యాచ్‌ ఎస్సైల వినతిపత్రం

డీజీపీతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ  

సాక్షి, హైదరాబాద్‌: పదోన్నతుల కల్పనలో తమకు న్యాయం చేయాలని 2009 బ్యాచ్‌ ఎస్సైలు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు. ఈ మేరకు సోమవారం 2009 బ్యాచ్‌కు చెందిన దాదాపు 85 మంది వరకు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు బీఆర్‌కేఆర్‌ భవన్‌ వద్ద మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 175 పోస్టులు ఖాళీగా ఉన్నా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు దక్కకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వీసు రూల్స్‌లో స్పష్టత లేని కారణంగా తమకు పదోన్నతులు రావడం లేదని వివరించారు. 2009 బ్యాచ్‌లో మొత్తం 435 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లలో ఇప్పటికే 220 మంది సీఐలుగా ప్రమోషన్లు పొందారని, మరో 215 మందికి పదోన్నతులు రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రమోషన్లు పొందిన తమ బ్యాచ్‌మేట్లు సీఐలుగా పనిచేస్తున్న చోటే తాము ఎస్సైలుగా పనిచేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాతజోన్ల విధానంలో లేదంటే నూతన మల్టీ జోన్‌ విధానంలో అయినా సరే తమకు వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. డీజీపీ అంజనీకుమార్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చినట్టు ఎస్సైలు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top