నేనేం పాపం చేశానమ్మా..!?

10 Days Girl Found In Bustand In Nalgonda - Sakshi

సాక్షి, మిర్యాలగూడ(నల్లగొండ): నవ మాసాలు మోసి జన్మనిచ్చావు..? ఆడ పిల్లనని వదిలించుకున్నావా..? మరో కారణంతో పేగు బంధాన్ని తెంచుకున్నావా..? నా ఆకలి ఎవరు తీరుస్తారు.. ఆలనా పాలనా చూసేవారేరీ..? గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసికందుకు మాటలు వచ్చి ఉంటే ఇలానే ప్రశ్నల వర్షం కురిపించేదేమో. తల్లిపొత్తిళ్లలో హాయిగా నిద్దరోవాల్సిన రోజుల శిశువు గుక్కపెట్టి ఏడుస్తూ గురువారం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ బస్టాండ్‌ పరిసరాల్లో ప్రయాణికుల కంటపడింది.పోలీసులు, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ శిశువును ఐసీడీఎస్‌ సిబ్బందికి అప్పగించారు.

వివరాలు.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌ అవరణలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ రోజుల ఆడ శిశువును ప్రయాణికులు లేని ప్రాంతంలో వదిలి వెళ్లింది. ఆ చిన్నారి గుక్కబట్టి ఏడుస్తుండటంతో ప్రయాణికులు, బిట్‌ పోలీసులు ఆర్టీసీ డీఎం బొల్లెద్దు పాల్‌కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని బస్టాండ్‌లో గల విచారణ విభాగం వారు మైక్‌లో తెలియజేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో టూ టౌన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీస్‌ సిబ్బంది శిశువును స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయాన్ని వైద్యులు ఐసీడీఎస్‌ సీడీపీఓ మమతకు సమాచారం అందించడంతో సూపర్‌వైజర్‌ మాధవి, అంగన్‌వాడీ టీచర్లు రజని, పద్మ ఆస్పత్రికి పంపించా రు. ఆడ శిశువును వదిలింది ఎవరు అనే విషయంపై ఆరా తీసినప్పటికి ఫలితం లేదు. స్థానిక టూ టౌన్‌ సీఐ సురేష్‌తో మాట్లాడి ఐసీడీఎస్‌ సిబ్బందికి అప్పగించగా నల్లగొండ శిశుగృహకు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top