ఐఐటీల్లో ఆధునిక బోధన | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో ఆధునిక బోధన

Published Sat, Jul 1 2023 2:14 AM

Modern teaching in IITs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో బోధన విధానంలో మరిన్ని మార్పులను కేంద్రం సూచిస్తోంది. కోవిడ్‌ వ్యాప్తి తర్వాత ఐఐటీల వైపు చూసే విద్యార్థుల చదువుల పరిస్థితిపై గతేడాది కేంద్ర విద్యాశాఖ అంతర్గత అధ్యయనం చేసింది. రెండేళ్లుగా విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ అంటేనే భయపడుతున్నారని ఈ సర్వేలో తేలింది. మెయిన్స్‌ వరకే విద్యార్థులు పరిమితం కావడం వెనుక బలమైన కారణాలున్నాయని కేంద్రం గుర్తించింది.

కోవిడ్‌ కాలంలో రెండేళ్లపాటు జరిగిన విద్యానష్టం వల్ల విద్యార్థుల్లో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అర్హత సాధించడం కష్టమనే భావన వచ్చిందని పరిశీలనలో తేలింది. అన్ని రాష్ట్రాల్లోనూ రెండేళ్లు  70 శాతమే సిలబస్‌ అమలు చేయడంతో కొన్ని చాప్టర్స్‌ విద్యార్థులకు అర్థంకాలేదని.. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఉన్న సిలబస్‌లో ఈ చాప్టర్లపట్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నారని తేలింది.

ఐఐటీల్లో సీట్లు పొందిన మొదటి సంవత్సరం చదవాలనే జిజ్ఞాస విద్యార్థుల్లో ఉండటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటర్‌ స్థాయి నుంచి నష్టపోయిన చాప్టర్స్‌ను ఆధునిక పద్ధతిలో వారికి బోధించే ఓ ప్రక్రియ ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన కొత్త సిలబస్‌ను ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. 

అమ్మో ఐఐటీ... 
కోవిడ్‌ కాలంలో రాష్ట్రాలు సిలబస్‌ తగ్గించినా... జేఈఈ పరీక్షల్లో మాత్రం అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌ వరకూ చాయిస్‌ వల్ల విద్యార్థులు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. కానీ అడ్వాన్స్‌డ్‌కు వచ్చే సరికి కష్టంగా భావిస్తున్నారు. ఈ కారణంగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినా.. పరీక్ష రాసే వారి సంఖ్య తగ్గుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వరకూ జేఈఈ మెయిన్స్‌ రాస్తున్నారు. వారిలో 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తున్నారు.

ఇలా అర్హత పొందే 2.50 లక్షల మందిలో పరీక్ష రాస్తున్న వారు మాత్రం 60 శాతం మించి ఉండటం లేదు. ఇలా రాసేవాళ్లలోనూ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులయ్యే వారు 30 శాతం కూడా ఉండటం లేదు. కోవిడ్‌ తర్వాత ఈ పరిస్థితి దారుణంగా ఉంటోంది. అర్హత సాధించాం కాబట్టి అడ్వాన్స్‌డ్‌కు హాజరవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

2022 జేఈఈ ఫలితాలను పరిశీలిస్తే అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణత 26.17 శాతంగానే నమోదైంది. 2021లో ఇది 29.54 శాతంగా ఉంది. 2022లో అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది అర్హత సాధిస్తే పరీక్ష రాసింది మాత్రం 1,55,538 మంది మాత్రమే కావడం గమనార్హం. వారిలో ఉత్తీర్ణులైంది 40,712 మంది. 2023లో 1.46 లక్షల మంది పరీక్ష రాస్తే 24.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

కోవిడ్‌ వేళ అర్థంకాని ఆన్‌లైన్‌ కోచింగ్‌... 
2019 నుంచి 2021 వరకూ కోచింగ్‌ తీసుకొనేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఆన్‌లైన్‌ కోచింగ్‌ పెరిగింది. కానీ గ్రామీణ, ఒక మాదిరి పట్టణ కేంద్రాల్లో చదువుకున్న విద్యార్థులు స్థానికేతరులు చెప్పే ఆన్‌లైన్‌ కోచింగ్‌ను అర్థం చేసుకోలేకపోయారు.

2022లో కోచింగ్‌ కేంద్రాలు తిరిగి తెరుచుకున్నా, నాణ్యతలేని ఫ్యాకల్టీ చాలా చోట్ల ఉందనే వాదన వినిపిస్తోంది. దీనికితోడు రెండేళ్లుగా చదువులో వెనుకబడటం కూడా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో శ్రద్ధ తగ్గడానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే ఎస్సీ అభ్యర్థులు 31.67 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, ఎస్టీ అభ్యర్థులు 26.83 శాతం, ఓబీసీ అభ్యర్థులు 16.44 శాతం అర్హత పొందారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జేఈఈతోపాటు ఐఐటీల విద్యావిధానంలోనూ మార్పులు అనివార్యమని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. 

Advertisement
Advertisement