మావోయిస్టు అగ్రనేత కటకం కన్నుమూత | Sakshi
Sakshi News home page

మావోయిస్టు అగ్రనేత కటకం కన్నుమూత

Published Sun, Jun 4 2023 9:30 AM

Maoist leader Katakam Sudarshan passed away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ బెల్లంపల్లి/ చర్ల: మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్‌ (69) అలియాస్‌ ఆనంద్‌ కన్నుమూశారు. ఐదు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన కొంతకాలం నుంచి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో దండకారణ్యం గెరిల్లా జోన్‌లో మే 31న మధ్యాహ్నం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీనిపై మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు.

వందలాది మంది పార్టీ, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్‌జీఏ) కార్యకర్తలు, నాయకులు, కమాండర్ల సమక్షంలో విప్లవ సాంప్రదాయాలతో సుదర్శన్‌ అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. సుదర్శన్‌ భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు మావోయిస్టు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. సుదర్శన్‌ మృతికి సంతాపంగా సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ర్యాడికల్‌ విద్యార్థి సంఘంతో మొదలై..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన పేద కార్మిక కుటుంబంలో పుట్టిన కటకం సుదర్శన్‌.. 1974లో మైనింగ్‌ డిప్లొమా చదువుతున్న సమయంలో విప్లవ పోరాటంలో అడుగుపెట్టారు. 1975లో ర్యాడికల్‌ విద్యార్థి సంఘం ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. తర్వాత బెల్లంపల్లి పార్టీ సెల్‌ సభ్యుడిగా, సింగరేణి కార్మిక ఉద్యమం, ర్యాడికల్‌ విద్యార్థి యువజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. నక్సల్బరీ, శ్రీకాకుళం సంఘర్షణ విముక్తి, పోరాటాల ప్రేరణతో అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరారు.

1978లో లక్సెట్టిపేట, జన్నారం ప్రాంతాల్లో పార్టీ ఆర్గనైజర్‌గా బాధ్యతలు చేపట్టి రైతాంగాన్ని విప్లవోద్యమంలో సమీకరించారు. 1980లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా దండకారణ్య ప్రాంతంలోకి విప్లవోద్యమాన్ని విస్తరించడంలో కీలకంగా పనిచేశారు. 1987లో దండకారణ్య కమిటీ సభ్యుడిగా, తర్వాత ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇంద్రవెల్లి ఆదివాసీ రైతాంగ ఉద్యమానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో భారత కమ్యూనిస్టు పార్టీ (పీపుల్స్‌ వార్‌) 9వ కాంగ్రెస్‌లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు.

ఐదు దశాబ్దాల ప్రస్థానం..
2004లో పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎంసీసీఐ) కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో 2007లో మరోమారు కేంద్ర కమిటీకి ఎన్నికై పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా, సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో కార్యదర్శిగా పనిచేశారు. మొత్తంగా 2001 నుంచి 2017 వరకు సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరో (సీఆర్‌బీ) కార్యదర్శిగా కొనసాగిన ఆయన.. తర్వాత అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతల నుంచి వైదొలగి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ విప్లవోద్యమ ప్రస్థానంలో సుదర్శన్‌ కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రచురితమైన పలు విప్లవ పత్రికలకు సంపాదకుడిగా కూడా వ్యవహరించారు.

జీవిత భాగస్వామి ఎన్‌కౌంటర్‌లో మృతి
విప్లవోద్యమంలో చేరిన తర్వాత సుదర్శన్‌ సహచర విప్లవకారిణి కోలం లలితాబాయి అలియాస్‌ లలితక్కను విప్లవ సిద్ధాంతం ప్రకారం వివాహం చేసుకున్నారు. లలితక్క పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 2003లో కుమురం భీం జిల్లా బెజ్జూర్‌ మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో ఆమె మృతి చెందారు. తర్వాత సుదర్శన్‌ మరో సహచర విప్లవకారిణి పద్మను ద్వితీయ వివాహం చేసుకున్నట్టు ప్రచారంలో ఉంది.

ప్రభుత్వాల ఫాసిస్టు విధానాల వల్లే సుదర్శన్‌ మరణం: మావోయిస్టులు
విప్లవోద్యమ నాయకులకు, కార్యకర్తలకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే సుదర్శన్‌ మరణించారని మావోయిస్టు కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. తీవ్ర అనారోగ్యంతో వైద్యం కోసం మావోయిస్టు, పీఎల్‌ఏ కార్యకర్తలు, నాయకులు పట్టణాలకు వెళ్తే.. పట్టుకుని హత్యలు చేయడం, లొంగిపోతేనే మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించడం క్రూరమైన చర్య అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ కొత్త ప్లాన్‌.. వారికి ఎక్కువ సీట్ల కేటాయింపు!


 

Advertisement
 
Advertisement