ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది: సీఎం కేసీఆర్‌

CM KCR Congratulates Telangana On Its Formation Celebrations - Sakshi

తొమ్మిదేళ్ల స్వరాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం కేసీఆర్‌ 

కుయుక్తులను తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుతం 

ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం ఇది 

రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: తొమ్మిదేళ్ల క్రితం దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలను దాటుకుంటూ, ప్రత్యర్థుల కుయుక్తులను తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అద్భుతమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఒకనాడు వెనుకబాటుకు గురైన తెలంగాణ నేడు సమస్త రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతోందని చెప్పారు. తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.. 
రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ముందెన్నడూ ఎరుగని రీతిలో ‘తెలంగాణ మోడల్‌’పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని.. ఇది తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని, ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమని చెప్పారు. 

వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం సహా సమస్త రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఆనందకర సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

ఎన్నో కష్టనష్టాలు, అవమానాలను అధిగమించి.. 
తెలంగాణ కోసం ఆరు దశాబ్ధాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజలను మమేకం చేస్తూ.. మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలను, అధిగమించిన అడ్డంకులను.. ‘బోధించు, సమీకరించు, పోరాడు’అనే పంథా ద్వారా రాష్ట్రంలో సకల జనులను సమీకరించి, అందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించామని యాది చేసుకున్నారు.  

ఇది కూడా చదవండి: పండుగ వాతావ‘రణం’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top