విడివిడిగా... కలివిడిగా.. పక్కా ప్లాన్‌తో కేసీఆర్‌.. ఆ సిట్టింగ్‌లకు టికెట్లు కష్టమే! | BRS chief KCR will meet party MLAs | Sakshi
Sakshi News home page

విడివిడిగా, కలివిడిగా.. పక్కా ప్లాన్‌తో కేసీఆర్‌.. సిట్టింగ్‌ స్థానాల్లో వారికి టికెట్లు కష్టమే!

Jul 2 2023 4:49 AM | Updated on Jul 2 2023 3:39 PM

BRS chief KCR will meet party MLAs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌... పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా రాజకీయ స్థితిగతులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పనితీరు, సంస్థాగత బలాలు, బలహీనతలు మదింపు చేస్తున్నారు. అలాగే విపక్ష పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేల అనుకూలతలు, ప్రతికూలతలపైనా లెక్కలు వేస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నియోజకవర్గాలవారీగా జరిగిన ఆత్మీయ సమ్మేళనాలు, జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్‌ ఓ అంచనాకు వచ్చారు. పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు, సొంత ప్రయోజనాల కోసం తలనొప్పులు సృష్టిస్తున్న వారి జాబితా కూడా కేసీఆర్‌ చేతికి అందినట్లు సమాచారం.

ప్రభుత్వ నిఘా వర్గాలతోపాటు వివిధ సర్వే సంస్థలు, పార్టీ జిల్లా ఇన్‌చార్జీల నుంచి అందిన నివేదికలను క్రోడీకరించి నియోజకవర్గాలవారీగా అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. జిల్లాలవారీగా పార్టీ ఎమ్మెల్యేల బృందాలతో భేటీ అవుతున్న కేసీఆర్‌... సందర్భాన్ని బట్టి కొందరిని విడిగా కూడా ప్రగతి భవన్‌కు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

జిల్లా పర్యటనల సందర్భంగా ఆశావహులు, ఇతరత్రా ముఖ్యులను కూడా ప్రగతి భవన్‌కు వచ్చి కలవాల్సిందిగా కేసీఆర్‌ సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలు, ప్రాంతాలు, రంగాలవారీగా అపరిష్కృత సమస్యలు, పార్టీలో అంతర్గత విభేదాలు, సర్దుబాట్ల వంటి అంశాలకు కూడా కేసీఆర్‌ ఎన్నికల వ్యూహంలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టికెట్ల కేటాయింపు కసరత్తు కొలిక్కి
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్లు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చినా సుమారు 15–20 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పదనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. టికెట్‌ ఖాయమైన వారు చురుగ్గా పనిచేసుకోవాలని పరోక్షంగా చెబుతున్నారు. మన్నె క్రిషాంక్‌ (సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక), చలిమెడ లక్ష్మీనర్సింహరావు (వేములవాడ) తదితరులకు ఈ తరహా సంకేతాలు అందినందునే పూర్తిస్థాయిలో ఎన్నికలు లక్ష్యంగా పనిచేసుకుంటున్నారు.

ఖమ్మంలో తాజాగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌తోపాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు బీఆర్‌ఎస్‌ను వీడిన నేపథ్యంలో ఎన్నికలు సమీపించేకొద్దీ బీఆర్‌ఎస్‌ నుంచి ఈ తరహా వలసలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గస్థాయి నేతలతోపాటు గ్రామస్థాయి నుంచి అవసరమైన చోట చేరికలు ఉండేలా చూసుకోవాలని పార్టీ అధినేత సూచించినట్లు సమాచారం. ఇతర పార్టీల్లో టికెట్‌ ఆశిస్తున్న నేతలు, అసంతృప్తులు, వారి ప్రభావం చూపే ఓటు బ్యాంకు తదితరాలపై ఇప్పటికే కేసీఆర్‌ వద్ద సమాచారం ఉంది. దీంతో ఎన్నికలు సమీపించే నాటికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో అధినేత ఉన్నారు.

అరడజను సీట్లపై చివరి వరకూ సస్పెన్స్‌?
అభ్యర్థుల ఎంపికలో విపక్షాల ఎత్తుగడలు, టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వ్యవహార శైలి తదితరాలను దృష్టిలో పెట్టుకొని కనీసం అరడజను స్థానాల్లో చివరి నిమిషం వరకు బీఆర్‌ఎస్‌లో సస్పెన్స్‌ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవాల పేరిట జూన్‌లో విస్తృతంగా జిల్లా పర్యటనలు చేసిన కేసీఆర్‌ జూలైలోనూ ఈ తరహా సభలు, సమావేశాల్లో పాల్గొనేలా షెడ్యూల్‌ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంలో భాగంగా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించే అవకాశముందని బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. 

వామపక్షాలకు చెరో రెండు సీట్లు!
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో అవగాహన ఉంటుందని సీపీఐ, సీపీఎం ఉమ్మడి ప్రకటన నేప థ్యంలో వారికి కేటాయించే సీట్ల సంఖ్య, నియోజ కవర్గాల పేర్లపై బీఆర్‌ఎస్‌లో ఆసక్తి నెలకొంది. అయితే కమ్యూనిస్టు పార్టీలకు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాలను కలుపుకొని చెరో రెండు స్థానాలకు మించి ఇచ్చే అవకాశాల లేవని సమాచారం.

అసెంబ్లీ టికెట్లకు బదులుగా శాసనమండలిలో చోటు కల్పించేందుకే కేసీఆర్‌ సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుత శాసనసభలో ప్రాతినిధ్యం లేని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టే ఉద్దేశంతో కేసీఆర్‌కు తమ ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement