కొరుక్కుపేట: విద్యతోనే భవిష్యత్‌ను ఉజ్వలంగా మలచుకోవచ్చునని ఉమ్మిడి యతిరాజ్ ఎక్స్‌పోర్ట్స్ నిర్వాహకులు ఉమ్మిడి ఉదయ్ కుమార్ హితవు పలికారు. ఎస్‌కేపీడీ అండ్ ఛారిటీస్ నిర్వహణలో కొనసాగుతున్న కేటీసీటీ బాలికల ప్రాథమిక పాఠశాల, కేటీసీటీ బాలికల మహోన్నత పాఠశాలల 102వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీనికి ఎస్‌కేపీసీ ఆడిటోరియం వేదికగా నిలిచింది. ఎస్‌కేపీడీ, కేటీసీటీ పాఠశాలల కరస్పాండెంట్ ఎస్ ఎల్ సుదర్శనం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మిడి ఉదయ్‌కుమార్ దంపతులు ముఖ్యఅతిథులుగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థినిలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతీ ఒక్కరి జీవితంలో విద్య చాలా ముఖ్యమైందని అన్నారు. ఈక్రమంలో బాలికలకు విద్య ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. విద్యతోనే తమ తమ భవిష్యత్‌ను ఉన్నతంగా మలచుకోగలరని విద్యార్థినిలకు సూచించారు. అంతకుముందు ఎస్ ఎల్ సుదర్శనం మాట్లాడుతూ వందసంవత్సరాలుగా పైగా ఎస్‌కేపీడీ యాజమాన్యం విద్యదానం చేస్తుందని ఇది తమకు ఎంతో గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్‌కేపీడీ ట్రస్టీలు దేసు లక్ష్మీనారాయణ, కిషోర్ బాబు, సెక్రటరీ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పదవ, ఫ్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి రోలింగ్ షీల్డ్‌లను అందించారు.


