నెల రోజులైనా అమలుకు నోచుకోని ఆటో చార్జీ | - | Sakshi
Sakshi News home page

నెల రోజులైనా అమలుకు నోచుకోని ఆటో చార్జీ

Nov 29 2026 1:35 PM | Updated on Nov 29 2026 1:35 PM

● కొత్త మీటర్‌ ఛార్జీల భేఖాతరు ● ఆటో డ్రైవర్ల అదనపు వసూళ్లతో ప్రయాణికుల బెంబేలు

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఆటోల కొత్త మీటర్‌ ఛార్జీలు అమల్లోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆటో డ్రైవర్లు ఇప్పటికీ మీటర్‌ వేయకుండానే ప్రయాణికుల నుంచి తమ ఇష్టానుసారంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు ప్రభుత్వం గత నెల 27వ తేదీన ఆటో మీటర్‌ ఛార్జీలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మొదటి 1.8 కిలోమీటర్లకు కనీస ఛార్జీగా రూ.50, ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.25 చొప్పున వసూలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.

ఆరు నెలల గడువు ఇచ్చినా..

రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా, ఒక్క చైన్నె నగరంలోనే సుమారు 2 లక్షల ఆటోలు తిరుగుతున్నాయి. పాత మీటర్లను కొత్త ఛార్జీలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఆరు నెలల గడువును రవాణా శాఖ ఇచ్చింది. అప్పటి వరకు సవరించిన ఛార్జీల పట్టికను ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా ఆటోలలో ప్రదర్శించి, పాత మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా కొత్త ఛార్జీని వసూలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను కూడా ప్రకటించింది.

నిబంధనలు గాలికి..

అయితే, కొత్త ఛార్జీల పెంపుపై అసంతృప్తిగా ఉన్న ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీస ఛార్జీ రూ.50 కాగా, దగ్గరి దూరాలకు సైతం కనీసం రూ.100 డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా చైన్నె సెంట్రల్‌, ఎగ్మోర్‌, పెరంబూర్‌, తాంబరం రైల్వే స్టేషన్లతో పాటు కోయంబేడు బస్టాండ్‌, ప్యారిస్‌ కార్నర్‌, టి. నగర్‌ వంటి రద్దీ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. కొత్త ఛార్జీలు ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు చైన్నె నగరం, శివారు ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక్క తనిఖీ కూడా నిర్వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక ఛార్జీల వసూళ్లపై తమకు అధికారికంగా ఫిర్యాదులు అందలేదంటూ అధికారులు బాధ్యతారహితంగా సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు వాపో తున్నారు. ప్రభుత్వం కొత్త మీటర్‌ ఛార్జీలను ప్రకటించినప్పటికీ, అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్య లు తీసుకుంటేనే సామాన్య ప్రయాణికులకు ఊరట లభిస్తుందని నగరవాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement