తిరువళ్లూరు: వరుసకు కూతురైన బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట ప్రాంతానికి చెందిన బాలిక తండ్రి అనారోగ్యంతో 8 ఏళ్ల క్రితం మృతి చెందాడు. బాలిక తల్లి అదే ప్రాంతానికి చెందిన మణి అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఈ క్రమంలో రాత్రిళ్లు తల్లి నిద్రించిన తర్వాత మణి బాలికపై లైగింక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె 2019లో ఊత్తుకోట మహిళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మణిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. అతనిపై నేరం రుజువు కావడంతో జడ్జి ఉమామహేశ్వరి గురువారం సాయంత్రం తీర్పును వెలువరించారు. నిందితుడికి జీవిత ఖైదు, రూ.60 వేల జరిమానా విధించారు. బాలికకు రూ.ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.


