తిరువళ్లూరు: గంజాయిని అక్రమంగా నిల్వ వుంచి వేర్వేరు ప్రాంతాల్లో విక్రయించడానికి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గంజాయి, గుట్కా, మత్తుమాత్రల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఒండికుప్పం బస్టాండు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతను చైన్నె సూలైమేడు ప్రాంతానికి చెందిన కామరాజ్(50)గా గుర్తించారు. ఇతను ఒడిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి మనవాలనగర్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు నిర్ధారించుకుని అరెస్టు చేసి గంజాయి స్వాధీ నం చేసుకున్నారు. అదే విధంగా పెద్దకుప్పం సమీపంలోని రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను విశ్వనాథన్ కుమారుడు తరుణ్(18)గా గుర్తించారు. ఇతను గంజాయిని ఆంధ్ర నుంచి రైలులో తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.


