వేలూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్త దానం చేసి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ లీలాఅలెక్స్ తెలిపారు. వేలూరు సమీపంలోని అడుక్కంబరై ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం, ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారికి అవార్డులు, విద్యార్థులకు అవగాహన సదస్సు, ర్యాలీ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ ప్రారంభించి వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి ప్రమాదాల్లో గాయపడిన వారు తరచూ వస్తుంటారని తెలిపారు. ఆ సమయంలో వారికి రక్తం ఎంతో అవసరం అవుతుందన్నారు. వారికి అవసరమైన రక్తాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారికి అవార్డులు అందజేసి అభినందించారు. అనంతరం నర్శింగ్ విద్యార్థులకు రక్తదానం, సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వేలూరు ప్రభుత్వ ఆస్పత్రి డీన్ ముత్తు చిత్ర, ఆరోగ్యశాఖ అసిస్టెంట్ అధికారి విజయ్ చంద్రన్ పాల్గొన్నారు.


