వరుణ..గండం | - | Sakshi
Sakshi News home page

వరుణ..గండం

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

8 జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు చైన్నె, శివారులలో ఈదురు గాలులకు అవకాశం ఈశాన్యం పనుల పర్యవేక్షణకు 15 మంది మంత్రులు సెప్టెంబరు ఆఖరులోపు పూడికతీత పనుల ముగింపునకు చర్యలు

నైరుతీ రుతు పవనాల రూపంలో రానున్న రోజులలో చైన్నెతో పాటూ 8 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్తలపై అధికారులు దృష్టి పెట్టారు. ఇక, సీఎం విజయ్‌ ఆదేశాలతో ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో వర్షాలను ఎదుర్కొనేందుకు చేపట్టనున్న పనుల పర్యవేక్షనకు 15 మంది మంత్రులను రంగంలోకి దించారు. సెప్టెంబరు నెలాఖరులోపు పూడిక తీత పనులను ముగించేందుకు సిద్ధమయ్యారు.

సాక్షి, చైన్నె: తమిళనాడులో నైరుతీ రుతుపవనాల గత వారం రోజులుగా ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్నాయి. తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడటమే ఈ వాతావరణ మార్పులకు కారణమని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది క్రమంగా విస్తరించనుండడంతో పశ్చిమ కనులలోని జిల్లాలతో పాటుగా ఉత్తర జిల్లాలైన చైన్నె, చెంగల్పట్టు, తిరువళ్లూర్‌, కాంచీపురం, రాణిపేట, వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, పుదుచ్చేరిలో రానున్న రోజులలో ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కి.మీ వేగంతో వీచే బలమైన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 1 , 2 తేదీలో పైన పేర్కొన్న జిల్లాలతో పాటుగా కళ్లకురిచ్చి, కడలూరు, తిరుచ్చి, రియలూర్‌, పెరంబలూర్‌, మైలాడుతురై జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 3 నుంచి 5 వ తేదీ వరకు పశ్చిమ కనుమల జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తమిళనాడులోని ఇతర ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైకాల్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగాచైన్నె, శివారులలో రాత్రులలో వర్షం కురుస్తోంది. మంగళ, బుధవారాలలో అనేక చోట్ల వర్షాలు మోస్తారు నుంచి భారీగా పడే అవకాశాలతో అధికారులు అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఇతర ప్రాంతాలలో ఎండ వేడిమి అధికంగా ఉండేందుకు వీలుందని ప్రకటించారు.

సెప్టెంబర్‌ చివరినాటికి పూర్తి చేయాలి

ఈశాన్య రుతుపవనాల ముందస్తు చర్యలలో భాగంగా చైన్నె నగరంలోని నీటి వనరులు, కాలువల్లో పూడికతీత పనులన్నింటినీ సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ జోనల్‌ పర్యవేక్షణ అధికారులను ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాల రాకను పురస్కరించుకుని చేపడుతున్న ముందస్తు చర్యలను పర్యవేక్షించడం, అవసరమైన సహాయక చర్యలు చేపట్టడం కోసం జోన్ల ప్రాతిపదికన ఇన్ఛార్జ్‌ మంత్రులను, పర్యవేక్షణ అధికారులను నియమిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశార ని వివరించారు. దీనిని పురస్కరించుకుని, రిబ్బన్‌ బిల్డింగ్‌లో పురపాలక పరిపాలన, తాగునీటి సరఫరా శాఖ కార్యదర్శి గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ అధ్యక్షతన ముందస్తు చర్యల సమాయత్తంపై రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైన్నె మెట్రో రైల్‌ ఎండి ఆశిష్‌ ఛటర్జీ, కార్పొరేషన్‌ కమిషనర్‌ జి.ఎస్‌. సమీరన్‌ సహా జలవనరుల శాఖ, హైవేస్‌, విద్యుత్‌, రైల్వే, సీఎండీఏ, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ మాట్లాడుతూ, ప్రతి జోన్‌ పరిధిలోని నీటి కాలువలు, నదులు, వర్షపు నీటి డ్రైనేజీలు, సిల్ట్‌ ట్రాప్‌లలో పూడికతీత, అభివృద్ధి పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించి సెప్టెంబర్‌ చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల నుంచి నీటిని బయటకు పంపింగ్‌ చేయడానికి వీలుగా మోటార్‌ పంపులను సిద్ధంగా ఉంచుకోవాలని వివరించారు. ఈశాన్య రుతుపవనాల ముందస్తు చర్యల కోసం రూ. 100 కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేసినట్టు గుర్తించారు. చైన్నె నగరంలోని 215 వరద సహాయక కేంద్రాలు, 111 కమ్యూనిటీ కిచెన్‌ ను పరిశీలించి అవసరమైన వసతులతో సిద్ధం చేయాలన్నారు. వరద సహాయక చర్యల కోసం 1000 మందికి పైగా వాలంటీర్లు, రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల నుంచి 721 మంది సిద్ధంగా ఉన్నారని వివరించారు.

అధికారులతో సీఎం విజయ్‌ సమీక్ష

పూడిక తీత పనులు

ఈశాన్యం పనుల పర్యవేక్షణకు మంత్రులు..

ఈశాన్య రుతు పవనాల సీజన్‌లో చైన్నె నగరం, శివారులలో భారీగానే వర్షం పడుతాయి. ఈ ఏడాది మరింతగా వర్షాలు పడుతాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ముందస్తు పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ముందస్తు చర్యలను పర్యవేక్షించి, తగిన సహాయక చర్యలు అందించడం కోసం 15 జోన్లకు ఇన్‌చార్జ్‌ మంత్రులు, పర్యవేక్షణ అధికారులను నియమిస్తూ సీఎం విజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తిరువొత్తియూరు , మనలి జోన్లకు దేవాదాయ శాఖ మంత్రి రమేష్‌, మాధవరం, తండయార్‌ పేట జోన్లకు వాణిజ్య పన్నుల శాఖమంత్రి లోకేష్‌ తమిళ్‌ సెల్వన్‌, రాయపురం, తిరు.వి.క.నగర్‌ జోన్లకు ఆరోగ్య శాఖ మంత్రి కె.జి. అరుణ్‌రాజ్‌ , అంబత్తూరు,అన్నానగర్‌, తేనాం పేట జోన్లకు చేనేత శాఖ మంత్రి విజయ్‌ బాలాజీ, కోడంబాక్కం, వలసరవాక్కంలకు సహజ వనరుల శాఖ మంత్రి టి.కె. ప్రభు, ఆలందూర్‌, అడయార్‌ జోన్లకు రవాణా శాఖ మంత్రి విజయ్‌ తమిళన్‌ పార్తీబన్‌, పెరుంగుడి , షోళింగనల్లూరులకు ఎకై ్సజ్‌ మంత్రి విఘ్నేష్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అలాగే, జోనల్‌ పర్యవేక్షణ అధికారులుగా ఐఏఎస్‌ అధికారులను నియమించారు. వీరిలో తిరువొత్తియూర్‌– కె. బాలసుబ్రమణియన్‌ (డైరెక్టర్‌, ఇండియన్‌ మెడిసిన్‌ – హోమియోపతి), మనలి – పి. కుమరవేల్‌ పాండియన్‌ (సభ్య కార్యదర్శి, తమిళనాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం), మాధవరం– ఎస్‌. అరుణ్‌రాజ్‌ (అదనపు డైరెక్టర్‌ ) , తండయార్‌ పేట – ఆర్‌ కన్నన్‌ (కమిషనర్‌, చక్కర ఉత్పత్తి విభాగం), రాయపురం– ఆశా అజిత్‌ (డైరెక్టర్‌, పర్యావరణ శాఖ) , తిరు.వి.క.నగర్‌ – పి. గణేశన్‌ (ఎండి, న్యూ తిరుపూర్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌), అంబత్తూర్‌– కె. వివేకానందన్‌ (ప్రత్యేక కార్యదర్శి, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహకం – వాణిజ్య శాఖ). అన్నానగర్‌ – పి. గాయత్రి కృష్ణన్‌ (డైరెక్టర్‌, సామాజిక భద్రతా పథకాల శాఖ), తేనాంపేట – టి. క్రీస్తురాజ్‌ (డైరెక్టర్‌, భూ సర్వే పథకం) , కోడంబాక్కం– ఎస్‌. గోపాల సుందర రాజ్‌ (కమిషనర్‌, భూ నిర్వహణ) వలసరవాక్కం– జె. విజయరాణి (డైరెక్టర్‌, ఉద్యానవన శాఖ), ఆలందూర్‌ – వాగే సంకేత్‌ బల్వంత్‌ (ఎండి, తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ), అడయార్‌ – కె. సెంథిల్‌ రాజ్‌ (డైరెక్టర్‌, ఆదిద్రావిడ సంక్షేమ శాఖ) పెరుంగుడి– మహేశ్వరి రవికుమార్‌ (డైరెక్టర్‌, కళా సాంస్కృతిక శాఖ) , షోళింగనల్లూర్‌ – డి. భాస్కర పాండియన్‌ (డైరెక్టర్‌, మ్యూజియమ్స్‌) ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement