తిరువళ్లూరు (తమిళనాడు): అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ముందు వెళ్తున్న లారీని ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. చైన్నె కొడుంగైయూరు ప్రాంతానికి చెందిన మణి కుమారుడు లోకనాథన్(42). ఇతను ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య పూంగొడి(39), కుమార్తె ధనలక్ష్మి(10), పూంగొడి తల్లి రాధ(65), పూంగొడి సోదరుడి కుమారులు గోకుల్(10), ప్రశాంత్(15) అనే ఆరుగురు శనివారం పెద్దపాళ్యంలోని భవానీ అమ్మవారి దర్శనం కోసం వచ్చినట్టు తెలుస్తోంది. దర్శనం ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. పెద్దపాళ్యం సమీపంలోని ఎంటీసీ బస్టాండ్ వద్ద వెళ్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి ముందుగా వెళ్లే లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పూంగొడి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన ఐదుగురిని స్థానికులు రక్షించి పెద్దపాళ్యం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే రాధ(65), గోకుల్(10), ధనలక్ష్మి (10) సైతం మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతిచెందిన వారి దేహాలను శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకనాథన్(42), , ప్రశాంత్(15)కు ప్రాథమిక వైద్యసేవలను అందించి మరింత మెరుగైన వైద్యం కోసం తిరువళ్లూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై గాయపడిన వారి నుంచి ఫిర్యాదును స్వీకరించిన పెద్దపాళ్యం ఇన్పెక్టర్ బాలకృష్ణన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కాగా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ముగ్గురు ప్రమాదానికి గురై మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
ప్రమాదంలో మరణించిన ధనలక్ష్మి, గోకుల్, రాధ, పూంగొడి (ఫైల్ ఫొటోలు)


