సాక్షి, చైన్నె : తూత్తుకుడిలో అక్రమ మద్యం విక్రయాల ఆరోపణలపై అరెస్టయిన అరుణాచలం (24) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించాడు. పోలీసుల తీవ్ర దాడి కారణంగానే అతడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ అరుణాచలం కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరిస్తూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
కేసు నేపథ్యం:
అముదా నగర్‌కు చెందిన అరుణాచలం (24) స్థానిక టాస్మాక్ బార్‌లో పనిచేస్తున్నాడు. జూలై 17న అతని వద్ద 120 అక్రమ మద్యం సీసాలు ఉన్నాయంటూ తూత్తుకుడి దక్షిణ వి భాగం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
విచారణ సమయంలో అరుణాచలం స్పృహతప్పి పడిపోవడంతో పోలీసులు అతడినిసొంత పూచీకత్తుపై విడుదల చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స ఫలించక ఉదయం అతను ప్రాణాలు విడిచాడు.
రోడ్డు దిగ్బంధం..
పోలీసుల దాడికి వ్యతిరేకంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోస్టుమార్టం నిలిపివేసి మృతదేహాన్ని ఆసుపత్రికి తేవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, డీఎంకే జిల్లా కార్యదర్శి జి. గీతాజీవన్ ఆధ్వర్యంలో రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం అందించారు. అయితే, తూత్తుకుడి జిల్లా పోలీసు యంత్రాంగం ఈ ఘటనపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అరుణాచలాన్ని అరెస్టు చేసిన తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి ఎలాంటి బాహ్య గాయాలు లేవని, ఫిట్‌గా ఉన్నాడని వైద్యులు ధ్రుకరించారు. పోలీసు స్టేషన్ సీసీ కెమెరా దృశ్యాల ప్రకారం.. అతను ఇతర ఖైదీలతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడని వివరించారు. వెంటనే అతని తల్లిని పిలిపించి జాగ్రత్తగా ఆసుపత్రికి పంపించడం జరిగిందన్నారు. అరుణాచలం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్ట ప్రకారం దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై తూత్తుకుడి ఎంపీ కనిమొళి సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా స్పందించారు. గత వారం నాగర్‌కోయిల్ ఘటన తర్వాత ఇప్పుడు తూత్తుకుడిలోనూ పోలీసుల వేధింపులకు గురై ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం అత్యంత వేదన కలిగిస్తున్నదన్నారు.


