ఆరుగురు ఎమ్మెల్యేలపై చర్యలు.. | - | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఎమ్మెల్యేలపై చర్యలు..

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

● అసెంబ్లీ స్పీకర్‌ హామీ ఇచ్చారన్న అన్నాడీఎంకే నేతలు

సాక్షి, చైన్నె: పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేసి అధికార పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ చర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకర్‌ హామీ ఇచ్చినట్లు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దళవాయి సుందరం, అగ్రి కృష్ణమూర్తి తెలిపారు. చైన్నె సచివాలయంలో తమిళనాడు శాసనసభ స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు:

అన్నాడీఎంకే గుర్తుపై గెలిచిన సి.విజయభాస్కర్‌, ఇసక్కి సుబ్బయ్య సహా 6 గురు ఎమ్మెల్యేలు హార్స్‌ ట్రేడింగ్‌ ద్వారా అధికార టీవీకే పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు. వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఇదివరకే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు.

స్పీకర్‌ అడిగిన వివరణకు స్పందన

శాసనసభాపక్ష నేత, విప్‌ ఎప్పుడు, ఎక్కడ ఎన్నికయ్యారు అనే వివరాలను స్పీకర్‌ కోరారని, చట్టప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే విప్‌ను నియమించే అధికారం ఉంటుందని తెలిపారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సమర్పించిన వివరణ లేఖను స్పీకర్‌కు అందించామని, త్వరలోనే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నుండి ఖాళీ కాగితాలపై సంతకాలు సేకరించారనడం అబద్ధమని, ఎవరూ ఖాళీ కాగితాలపై సంతకాలు చేయరని స్పష్టం చేశారు. విప్‌ ఆదేశాలను ఉల్లంఘించే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడమే చట్టమని పేర్కొన్నారు. అసెంబ్లీ నియమావళి ప్రకారం పార్టీలు సూచించిన వ్యక్తులనే విప్‌ వంటి పదవుల్లో స్పీకర్‌ గుర్తించాలని, స్పీకర్‌ చట్టానికి లోబడి నిష్పాక్షికంగా వ్యవహరిస్తారనే నమ్మకం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు వెళ్లినంత మాత్రాన అన్నాడీఎంకే బలహీనపడదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement