సాక్షి, చె,న్నై : తమిళనాడులో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దిగువ కోర్టుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని న్యాయ శాఖ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ వెల్లడించారు. చైన్నె హైకోర్టులోని ప్రముఖ న్యాయవాదుల సంఘం మద్రాస్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సి.టి.ఆర్. నిర్మల్ కుమార్‌కు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 150 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగి, ఎంతో మంది ప్రముఖ న్యాయవాదులను, న్యాయమూర్తులను అందించిన మద్రాస్ బార్ అసోసియేషన్ తనను సన్మానించడం పై కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
న్యాయ వ్యవస్థలో సంస్కరణలు
చట్టం, న్యాయ శాఖలో ఇంకా కొన్ని లోపాలు, సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. కేసుల పెండింగ్‌ను త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా దిగువ కోర్టుల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. ప్రతి 200 కేసులకు ఒక కోర్టు ఉండేలా చర్యలను వేగవంతం చేయాలని సీఎం విజయ్ ఆదేశించినట్లు మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మద్రాస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వి.ఆర్. కమలనాథన్, కార్యదర్శి జె. బోతిరాజ్, కోశాధికారి వి.టి. బాలాజీ, అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన క్రిమినల్ అడ్వకేట్ జాన్ సత్యన్, టీవీకే న్యాయవాదుల విభాగం రాష్ట్ర నిర్వాహకుడు ఎస్. అరివళగన్ తదితరులు పాల్గొన్నారు.


