సాక్షి,చైన్నె: ప్రస్తుతం విధుల్లో ఉన్న (ఇన్–సర్వీస్) ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలను విడుదల చేయవద్దంటూ మద్రాస్ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. వివరాలు.. విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో, ఈ ఏడాది జనవరిలో తమిళనాడు ప్రభుత్వం ఒక జీఓ జారీ చేసింది. ఆ మేరకు బీసీ, ఎంబీసీ, దివ్యాంగుల అభ్యర్థుల కనీస అర్హత మార్కులను 55 శాతం నుండి 50 శాతానికి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల మార్కులను 45శాతం నుండి 40 శాతానికి తగ్గించింది.
జనరల్ కేటగిరీ అభ్యర్థుల పిటిషన్
బిహార్ రాష్ట్రంలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 50 శాతంగానే ఉన్నాయని, అదేవిధంగా తమిళనాడులోనూ జనరల్ కేటగిరీ ఉపాధ్యాయుల కనీస అర్హత మార్కులను 60 శాతం నుండి 50 శాతానికి తగ్గించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రామకష్ణన్‌తో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పీజీ అసిస్టెంట్ పోస్టుల దరఖాస్తుకు ఇప్పటికే జనరల్ కేటగిరీకి 50శాతం మార్కులే ప్రామాణికంగా ఉన్న విషయాన్ని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కోర్టు ఆదేశాలు
ఈ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ పి.టి. ఆశా సమక్షంలో విచారణకు వచ్చింది. జనరల్ కేటగిరీ ఉపాధ్యాయుల కనీస అర్హత మార్కుల తగ్గింపు వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం త్వరలోనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే ఈ విధానపరమైన నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించేందుకు వీలుగా న్యాయమూర్తి ఈ కేసు విచారణను జూలై 24కి వాయిదా వేశారు. అంతవరకు ఈ ప్రత్యేక టెట్ పరీక్ష ఫలితాలను ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.


