కావేరి జలాలపై దృష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

కావేరి జలాలపై దృష్టి పెట్టండి

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

● ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు

సాక్షి, చైన్నె: ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై పెట్టే శ్రద్ధలో కొంచైమెనా కర్ణాటక ప్రభుత్వం నుండి తమిళనాడుకు రావాల్సిన కావేరి నీటిని రాబట్టడంపై పెట్టాలని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ అధికార టీవీకే ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ ఖాతాలో ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని, అలాగే తమను నీరు కావాలని తమిళనాడు ప్రభుత్వం నుండి ఎవరూ సంప్రదించలేదని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి రామలింగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని ఉదయనిధి పేర్కొన్నారు. గత ఐదేళ్ల మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పాలనలో ఏటా జూన్‌ 12వ తేదీన ఖచ్చితంగా కురువై సాగు కోసం మెట్టూరు డ్యామ్‌ నుండి నీటిని విడుదల చేసేవారని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది ఇప్పటివరకు మెట్టూరు డ్యామ్‌ నుండి నీరు విడుదల కాలేదని మండిపడ్డారు. ఇప్పటికే పంట రుణాల మాఫీ పేరుతో రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు కర్ణాటక మంత్రి వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

అధికార పక్షంపై ఒత్తిడి

కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డు తీర్పు ప్రకారం జూన్‌ నెలలో విడుదల చేయాల్సిన 9.91 టీఎంసీల నీటిని కర్ణాటక విడుదల చేయలేదని, ఇప్పుడు జూలై నెలలో ఇవ్వాల్సిన 32 టీఎంసీల నీటిని కూడా ఇచ్చేందుకు నిరాకరిస్తోందని ఉదయనిధి ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీతో లోపాయికారీ పొత్తు పెట్టుకున్న పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక నుండి తమిళనాడుకు దక్కాల్సిన నీటిని ముఖ్యమంత్రి వెంటనే అడిగి సాధించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేలను కొనడం పక్కన పెట్టి, రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం కర్ణాటక నుండి కావేరి నీటిని తీసుకురావడంపై తక్షణమే దృష్టి సారించాలని ఉదయనిధి స్టాలిన్‌ గట్టిగా డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement