తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లాలోని తిరువళ్లూరు, తిరుత్తణి, ఆర్కేపేట, ఆవడి, గుమ్మిడిపూండి, పొన్నేరి, ఊత్తుకోట తదితర తాలుక ప్రాంతాల పరిదిలో సుమారు పది వేల మంది ఎస్టీలు నివాసం వుంటున్నారు. వీరికి పట్టాలు మంజూరు తమిళనాడు కొండజాతీయుల సంఘం ఆధ్వర్యంలో పలు దఫాలుగా ఆందోళన నిర్వహించారు. అయితే ఆందోళన నిర్వహించే సమయంలో కలెక్టర్‌తో సహా పలువురు హమీ ఇవ్వడం, హమీలను నమ్మి ఆందోళననూ విరమించడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఏళ్ల తరబడి ఆందోళన చేస్తున్నా ఇంత వరకు పట్టాలు ఇవ్వకపోవడంతో తమిళనాడు కొండజాతీయుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం జాగారం పేరిట ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి తమిళ్‌సెల్వవన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మేల్యే రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీబాబు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో కలెక్టర్ అర్హులైన వారికి పట్టాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని హమీ ఇచ్చి పంపించి వేశారు.


